
సాక్షి, కర్నూలు: నంద్యాలలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాయలసీమలో వర్షాలు బాగా కురిసి వర్షపాతం సాధారణ స్థాయికి వచ్చిందన్నారు. నంద్యాల డివిజన్‌లో 17 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆర్ అండ్ బీ రోడ్లు, పీఆర్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని.. ఫలితంగా రూ. 784కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అంతేకాక 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో కుందు నది పరివాహక ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు జగన్.
కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారని.. అవి మధ్యలోనే ఆగిపోయానని తెలిపారు. త్వరలోనే వాటిని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఎక్కువ ఇస్తామన్నారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment