సాక్షి, రాజమండ్రి : గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయంతోపాటు అదనంగా రూ. 5వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ సహాయం కూడా అందనుంది. గురువారం ముంపు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ బిల్డింగ్‌లో సీఎం వైఎస్ జగన్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇళ్లు, పంటలు నష్టపోయినా వారికి నిబంధనల ప్రకారం అందే సాయం కాకుండా ప్రత్యేకంగా రూ. 5 వేల సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నట్టు తెలిపారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. అందుకోసమే రూ. 5వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ముంపుకు గురైన గ్రామాల్లోనే కాకుండా.. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు దెబ్బతింటే.. వారికి పరిహారంతో పాటు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు అందజేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్‌కుమార్‌యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కండపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణతోపాటు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరిలో 10, 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని.. కానీ ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు పెరిగిందని వారు సీఎం జగన్‌కు వివరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకోని.. అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలోకి వచ్చే వరద, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. త్వరగా ముంపుకు గురయ్యే ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా, సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment