సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు.
ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత
నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలకు అండగా నిలవడమే లక్ష్యం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయని చంద్రబాబు
పైగా సంక్షేమ పథకాలకు కోత..ప్రజలపై ఆర్థిక భారం
సర్కారు వైఖరిని ఎండగ ట్టనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: గడిచిన ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ఆయన దీక్ష కొనసాగించనున్నారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజున చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. పైగా ఎనిమిది నెలల పాలనలో వరుసగా సంక్షేమ పథకాల్లో కోత విధించడమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న వైనాన్ని ఈ దీక్ష సందర్భంగా జగన్ ఎండగట్టనున్నారు.
2014 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కేవలం పంట రుణాలకు మాఫీ అంటూ అందులోనూ కోతలు పెట్టి గడిచిన ఎనిమిది నెలలుగా రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్న కారణంగా రైతాంగంపై మోయలేనంత అపరాధ వడ్డీ భారం పడింది. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయనితీరును ఎత్తిచూపడంతో పాటు అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోని తీరును ఈ దీక్ష ద్వారా జగన్ ఎండగడతారని పార్టీ నేతలు చెప్పారు.
ప్రజల పక్షాన గొంతెత్తడానికి జగన్ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై చంద్రబాబు మాట మార్చినందుకు నిరసనగా 2014 జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు నరకాసుర వధ పేరిట ఆందోళనను వైఎస్సార్‌సీపీ నిర్వహించింది. అదే ఏడాది నవంబర్ 5న ప్రభుత్వ విధానాలకు నిరసనగా 661 మండల కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు జరిగాయి. డిసెంబర్ 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో జగన్ నిరాహారదీక్ష చేపట్టనున్నారు.
ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు..
జగన్ గతంలో ప్రజల పక్షాన లక్ష్యదీక్ష, జలదీక్ష, రైతు దీక్ష, ఫీజుపోరు వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ పలు సందర్భాల్లో ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చంద్రబాబు సంక్షేమ పథకాల్లో కోత విధించడం, హామీలను అమలు చేయకపోవడం వంటివి ఒక ఎతై్తతే, కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టీ పట్టక ముందునుంచే.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై హింసాకాండ ప్రారంభమైంది. తొలి మూడు నెలల్లోనే డజను మందికిపైగా వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ హింసకు బలైతే, వందలాది మంది గాయపడ్డారు. వీటితో పాటు అక్రమ కేసుల బనాయింపునకు పాల్పడుతున్న సమయాల్లో పార్టీ తీవ్ర నిరసన గళం వినిపించింది.