ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలుసుకునేందుకు అక్కడి నుంచి నందిగామకు బయలుదేరారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పెనుగంచిప్రోలుకు వచ్చారు.
జగన్ వస్తున్నారని తెలియగానే అధికారులు హడావుడి చేశారు. ప్రమాదానికి గురైన బస్సును హుటాహుటిన బయటకు తీసి దూరంగా తరలించే యత్నం చేశారు. నందిగామలో మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.