
'సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు'
పీలేరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కుయుక్త రాజకీయాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వారు సిగ్గు లేకుండా నీతిమాలిన రాజకీయలకు పాల్పడుతున్నారని విమర్శించారు.చిత్తూరు జిల్లాలోని సమైక్య శంఖారావంలో భాగంగా పీలేరు బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జగన్..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించడాన్ని ప్రశ్నించారు. సమైక్య నినాదం వినిపించినందుకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో సమైక్యం అన్నందుకు ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తారా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సమైక్య తీర్మానం చేయాలన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు వెనుక అధిష్టానం హస్తం ఉందని జగన్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంత నాయకులకు రెండు వాదనలు వినిపించమని చెబుతున్నారు. ఎవరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతున్నారో, ఎవరు విభజన రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారని జగన్ ప్రశ్నించారు.దివంగత ముఖ్యమంత్రి బ్రతికున్నప్పుడు ఏ ఒక్కరు రాష్ట్ర విభజనపై నోరెత్తకుండా ఇప్పుడు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.