
'గుంటూరు-బెజవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 3,4 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు-విజయవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.
చంద్రబాబు ఏడాది పాలనలో పూర్తిగా ప్రజలను మోసగించారని పార్థసారధి విమర్శించారు. ప్రజలను ఈ విధంగా మోసం, దగా చేసిన ప్రభుత్వాలను తాము ఎన్నడూ చూడలేదన్నారు. రుణమాఫీ, స్పెషల్ స్టేటస్, బలవంతపు భూసేకరణ, నిరుద్యోగ భృతి వంటి అంశాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని పార్థసారధి ధ్వజమెత్తారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు.