కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పాలకులు ఎందరో ఉంటారు. కానీ ‘ప్రజా పాలకులు’ కొందరే ఉంటారు. జనం మనసెరిగి పాలించడమే కాదు..వారి కష్టసుఖాల్లోనూ తోడూ నీడగా ఉండడం ఉత్తమ పాలకుని విధి, బాధ్యత. అలాంటి వారు జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తరాలు మారినా చరిత్రలో వారి స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. ఇలాంటి కోవకే చెందుతారు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రగతికి బాటలు వేయడమే కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం కడదాకా తపించిన రాజన్న జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.ఆయన మరణించి తొమ్మిదేళ్లవుతున్నా నేటికీ ఆయన జ్ఞాపకాలు ప్రజల మదిలో నిలిచే ఉన్నాయి.
సంక్షేమ సారథి
పండుటాకులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు..ఇలా అన్ని రకాల పింఛన్లు 3.50 లక్షల మందికి మంజూరు చేసి బాసటగా నిలిచారు. చేనేతకు ఆ‘ధార’మై ఆదుకున్నారు. వారికి సంబంధించిన రూ.7.90 కోట్ల రుణాలు మాఫీ చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారు. నేడు జిల్లాలో 4,417 మంది నేతన్నలకు పింఛన్ అందుతోందంటే వైఎస్సార్ చలువే. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఎంతోమందికి ప్రాణాలు నిలిపారు. అత్యవసర వైద్యసేవల కోసం 108 అంబులెన్స్‌లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 104 సేవలు ప్రవేశపెట్టారు.
పేదల ఇంటి కలను సాకారం చేశారు. జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద 3.28 లక్షల గృహాలు మంజూరు చేసి.. రూ.1,013 కోట్లు ఖర్చు పెట్టారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం, స్కాలర్‌షిప్పుల ద్వారా పేదల జీవితాల్లో విద్యావెలుగులు నింపారు. ఎందరో పేదపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని ఎంతో మంది పేదపిల్లలు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులయ్యారు. కడు పేదరికంలో మగ్గుతున్న ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి అభ్యున్నతికి తోడ్పడ్డాయి.
జిల్లాతో ప్రత్యేక అనుబంధం
వైఎస్సార్‌కు కర్నూలు జిల్లాతో ప్రత్యేకానుబంధం ఉంది. 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రి హోదాలో 29 సార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారీ అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, ముచ్చుమర్రితో కృష్ణా, తుంగభద్ర నదుల అనుసంధానం కోసం కృషి చేశారు. రాయలసీమ జిల్లాల కల్పతరువైన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడమే కాకుండా పనులు కూడా చాలావరకు పూర్తి చేయించారు.
ఆయన చలువ వల్లే నేడు హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. అలాగే జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్, కేసీ కెనాల్, తెలుగు గంగ కాలువల లైనింగ్ పనులను చేపట్టారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నలను ఆదుకునేందుకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మాఫీ చేయించారు. అలాగే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడంతో నేటికీ లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.మరీ ముఖ్యంగా 2004, 2009 ఎన్నికల ప్రచారాన్ని నందికొట్కూరు, ఆలూరులో ముగించి..జిల్లాతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. వైఎస్సార్ ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆర్‌యూకు అంకురార్పణ
జిల్లాను విద్యాపరంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకు వైఎస్ అనేక చర్యలు తీసుకున్నారు. ఇక్కడ బీటెక్, బీఈడీ, డీఈడీ కళాశాలల ఏర్పాటుతో పాటు రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. అప్పటి వరకు ఎస్‌కేయూ స్టడీ సెంటర్‌గా ఉన్నదాన్ని రాయలసీమ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తూ రూ.100 కోట్లు కేటాయించారు. యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేయించారు. అయితే.. ఆ తరువాత వచ్చిన పాలకులు వీటిని నెరవేర్చలేకపోయారు.
ప్రతి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గంలో పెద్దఎత్తున నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతిచోటా వైఎస్‌ఆర్ చిత్రపటాలకు ఘన నివాళి అర్పించి.. సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం పది గంటలకు నిర్వహించే వర్ధంతి కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు.
పేర్లు మార్చి..నిర్వీర్యం చేస్తూ..
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విశేష జనాదరణ చూరగొనడంతో నేటి చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో వాటి పేర్లు మార్చి అమలు చేస్తోంది. నిధుల కొరతను కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు ఇవ్వడంలేదు. 108, 104 వాహనాలకు డీజిల్ పోయించడంలేదు. పొదుపు మహిళలు, రైతులకు పావలావడ్డీకే రుణాలు ఇవ్వకుండా వేధిస్తోంది. ఇలా వైఎస్‌ఆర్ పేరును మరచిపోయేలా చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం ఆయనపై అభిమానం మరింత రెట్టింపవుతోంది.
4 శాతం రిజర్వేషన్‌తోనే డాక్టరయ్యా
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే. పేదలైన మాలాంటి వారు వైద్య విద్య గురించి ఆలోచించారు. రిజర్వేషన్‌తో ఫ్రీ సీటు రావడంతో కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో డీఎన్‌బీ విద్యను పూర్తి చేశాను. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో వైద్యుడిగా పని చేస్తున్నాను. ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు రిజర్వేషన్లు కల్పించడంతో మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడింది.
– మహమ్మద్‌రఫీ, చాబోలు
Comments
Please login to add a commentAdd a comment