అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు.. అన్ని ప్రాంతాలకు విస్తరించాలి.. లేకపోతే ప్రాంతాలు, ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని దూరదృష్టితో గ్రహించిన ఒకే ఒక్క నేత.. వైఎస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన సీఎంలంతా అభివృద్ధినంతా హైదరాబాద్‌కే పరిమితం చేస్తే.. వైఎస్సార్ మాత్రమే రాష్ట్రమంతా విస్తరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలు.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అద్భుతమైన ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటిని కార్యరూపం దాల్చేలా చేశారు. వాటిలో చాలా ప్రాజెక్టులను ఆయన హయాంలోనే ప్రారంభించారు. ఆయన ఆకస్మిక మృతితో మరికొన్ని ప్రాజెక్టులను తర్వాత పాలకులు అటకెక్కించారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో వైఎస్ కలల ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కుతాయనే ఆశతో రాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను ఐటీ, ఫార్మా హబ్‌గా వైఎస్సార్ తీర్చిదిద్దారు. అప్పటివరకు ఐటీ అంటే కేవలం హైదరాబాద్ వైపు మాత్రమే కంపెనీలు చూసేవి. విశాఖ సమీపంలో మధురవాడలో ఐటీ హిల్స్‌ను ఏర్పాటు చేసి ఐటీ కంపెనీలను రప్పించారు. ఫార్మా సెజ్‌లను కూడా ఏర్పాటు చేయడంతో రెడ్డీస్, అరబిందో, దివీస్, రాంకీ, హెటిరో వంటి సంస్థలు ఉత్తరాంధ్రలో భారీగా ఫార్మా యూనిట్లను నెలకొల్పాయి. విశాఖ పోర్టుకు అదనంగా గంగవరం పోర్టును కూడా అందుబాటులోకి తేవడంతో పోర్టు ఆధారిత పరిశ్రమలు వేగంగా విస్తరించాయి. ప్రముఖ గార్మెంట్స్ సంస్థ బ్రాండిక్స్ విశాఖలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అనేక అంతర్జాతీయ బ్రాండ్‌ల దుస్తులు స్థానిక మహిళల చేతుల్లో తయారవుతున్నాయి. పెట్రోకెమికల్ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత వాసులకు మరింతగా ఉపాధి అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.
వాణిజ్య కేంద్రంగా.. కోస్తాంధ్ర
ఓడరేవులను అభివృద్ధి చేయడం ద్వారా కోస్తాంధ్రను వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడానికి విశాఖ సమీపంలో గంగవరం, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టులను పూర్తిచేశారు. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధితో బందరు పోర్టు, ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ పేరుతో ఓడరేవు వద్ద ఒక భారీ రేవు ఆధారిత ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే.. వైఎస్సార్ అకాల మృతితో ఈ ప్రాజెక్టులను తర్వాత పాలకులు అటకెక్కించేశారు. ఇతర రాష్ట్రాలతో పోరాడి మరీ సాధించిన విశాఖ–కాకినాడ భారీ పెట్రో–కెమికల్ ప్రాజెక్టుకు అదే గతి పట్టించారు. తన హయాంలో వైఎస్సార్ అనేక ఐటీ, తయారీ రంగ సెజ్‌లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మాంబట్టు, అపాచీ, మేనకూరు, విశాఖలోని బ్రాండిక్స్ సెజ్‌ల ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఒక్క అపాచీ సెజ్‌లోనే సుమారు 18 వేల మంది.. అందులోనూ మహిళలే ఎక్కువ మంది పనిచేస్తున్నారంటే పారిశ్రామికాభివృద్ధిలో వైఎస్సార్ దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో ఎల్ అండ్ టీ మేథా టవర్స్, కాకినాడలో ఇన్ఫోటెక్‌లను ఏర్పాటు చేయించారు.
రాష్ట్రమంతా విద్యా సంస్థల ఏర్పాటు
వైఎస్సార్ హయాంలో విద్యా రంగం కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచీకరణ ఫలాలు గ్రామీణ విద్యార్థులకు అందించేందుకు ట్రిపుల్ ఐటీలను నూజివీడు (కోస్తాంధ్ర), ఇడుపులపాయ (రాయలసీమ), బాసర (తెలంగాణ)లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో దామోదరం సంజీవయ్య లా వర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ వర్సిటీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జేఎన్‌టీయూ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కృష్ణా వర్సిటీ, నెల్లూరులో విక్రమ సింహపురి వర్సిటీ, చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం, కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, కర్నూలులో రాయలసీమ విశ్వవిద్యాలయం, అనంతపురంలో జేఎన్‌టీయూ, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం, కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయం, నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లో పాలమూరు వర్సిటీ, హైదరాబాద్‌లో జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలను ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్‌లో ఐఐటీ, విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లను ఏర్పాటు చేయించారు.
తయారీ కేంద్రంగా.. రాయలసీమ
తీవ్ర కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతుండటం, గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయిపోతుండటం వైఎస్సార్ మనసును కలిచివేసేవి. దీంతో 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే రాయలసీమను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ సెజ్‌ను ఏర్పాటు చేసి అనేక తయారీ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టే విధంగా దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు శ్రీ సిటీ ద్వారా 35 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. అలాగే హైదరాబాద్ అభివృద్ధిలో మిథానీ, డీఆర్‌డీఎల్, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కీలకంగా వ్యవహరించాయని వైఎస్సార్ బలంగా విశ్వసించేవారు. అలాంటి భారీ ప్రాజెక్టును ఒకటి రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారతాయని దాని ఏర్పాటుకు సంకల్పించారు. దీంతో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పోరాడి మరీ రూ.6,000 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఎల్ ప్లాంట్‌ను సాధించారు. ఇనుప ఖనిజం భారీగా లభించే ప్రాంతం కావడంతో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంకల్పించి బ్రాహ్మణి స్టీల్ పేరుతో శంకుస్థాపన కూడా చేశారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఎలక్ట్రానిక్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఈ రెండు ఆగిపోయాయి.
నాలుగు ప్రాంతాల్లోనూ రిమ్స్
స్వతహాగా వైద్యుడైన వైఎస్సార్ వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్యం అందించేందుకు పరితపించారు. అందుకే విప్లవాత్మక రీతిలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ (ఆదిలాబాద్), ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం), కోస్తాంధ్ర (ఒంగోలు), రాయలసీమ (కడప)ల్లో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లకు రూపకల్పన చేశారు. రూ.వెయ్యి కోట్లతో ఒకేసారి నాలుగు రిమ్స్‌లను ఏర్పాటు చేశారు. అందులోనూ అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఆధునిక వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు రిమ్స్‌లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ద్వారా రాష్ట్రానికి ఒకేసారి 400 మెడికల్ సీట్లు కూడా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment