
ఆరోగ్యశ్రీతో ఉన్నత వైద్యం అందించి..ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం సృష్టించి..జలయజ్ఞంతో బీడులను సస్యశ్యామలం చేసి..పింఛన్‌తో పండుటాకులకు భరోసా ఇచ్చి.. రుణాలతో మహిళా సాధికారత సాధించి..నీడలేని పేదలకు గృహయోగం కల్పించి..పచ్చని పశ్చిమకు పోల‘వరం’ ప్రసాదించి..ఉద్యాన సిరులు పండించేలా విద్యాలయం స్థాపించి..చెదరని జ్ఞాపకంలా.. చెరగని సంతకంలా..జన హృదయ నేతగా.. అభివృద్ధి ప్రదాతగా..ఇలా అందరిలోనూ కొలువైన నువ్వు..మాతో లేవని ఎవరనగలరు రాజన్నా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆ మహానేత పాద స్పర్శతో పశ్చిమగోదావరి జిల్లా పులకించిపోయింది. ఆయన ఎక్కడ అడుగువేస్తే అక్కడ ప్రకృతి పచ్చని పంటల తివాచీ వేసి స్వాగతించింది. జిల్లా ప్రజల నుంచి ఆయన పొందిన ప్రేమాభిమానాలకు వెలకట్టలేక జిల్లాను అభివృద్ధి పథంలో నడపడమే ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏకైక మార్గమని మహానేత భావించారు. అనుకున్నదే తడవుగా జిల్లా ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన పశ్చిమ నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముం దుకు వచ్చారు.
ఏలూరు దుఃఖదాయినికి అడ్డుకట్ట
ఏలూరు ప్రజలకు దుఖఃదాయినిగా ఉన్న తమ్మిలేరు వరదల నుంచి జిల్లా కేంద్ర ప్రజలకు విముక్తి కల్పించారు మహానేత వైఎస్సార్. ఏలూరు నగరాన్ని రెండుగా విడిపోయి చుట్టేసే తమ్మిలేరు ఎప్పుడు ముంచేస్తుందోననే భయంతో నగరవాసులు జీవించేవారు. 2005లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించిన వైఎస్సార్ ఇక్కడి నుంచి వెళ్లకముందే మొదటి దశ పనులకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. సుమారు రూ.90 కోట్ల నిధులు విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. వైఎస్సార్ స్వయంగా రూపొందించి అమలు చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వందలాది కుటుంబాల పాలిట అపర సంజీవనిగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులకు ఉన్నత చదువుల భాగ్యాన్ని కల్పించి ఎందరో విద్యార్థుల జీవితాలకు వైఎస్సార్ అండగా నిలిచా రు. ఇలా ఏ గుండెను కదిపినా వైఎస్ నామ జప మే.. వైఎస్సార్ తన హయాంలో ఏ వర్గ ప్రజ లనూ విస్మరించకుండా అందరికీ అవసరమయ్యే పథకాలతో వారి గుండెల్లో నిలిచిపోయారు. జిల్లాలోని ఏజెన్సీలోని నిరుపేదలు ఆయన పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందారు.
భూదాత.. అభివృద్ధి ప్రదాత
జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూపంపిణీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎస్సీ, ఎస్టీ నిరుపేద రైతుల భూముల్లో ఇందిర ప్రభ పథకం ద్వారా బోర్లు వేయించడంతో పాటు విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చారు.
పోలవరం.. ఉద్యాన విశ్వవిద్యాలయం
జిల్లాలోని మెట్ట ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలనే తలంపుతో జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి పూ నుకున్న ఏకైక నాయకుడిగా జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన నేత కూడా వైఎస్సార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగావకాశాలు పొందేలా వైఎస్ తీసుకున్న చొరవ ఇప్పటికీ ఆయన తీపిగురుతుగా నిలిచిపోయింది.
గూడెం గుండెల్లో కొలువై..
తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మహా నేత రూ.600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. ప్రజల ఆరోగ్యానికి ఆయన ఎంతగా తపించేవారో ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే చెబుతుంది. అటువంటిది మెట్ట ప్రాంతంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి జిల్లాలోని మెట్ట ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లక్షల ఎకరాల భూములకు సాగునీరందించడానికి ఏర్పాటుచేశారు.
సస్యశ్యామలమే లక్ష్యంగా..
పోలవరం గ్రామానికి వరద ప్రమాదం లేకుండా రూ.6 కోట్లతో నెక్లెస్ బండ్, పోలవరం నియోజకవర్గంలోని ముంపు జలాలను గోదావరి నదిలోకి మళ్లించడానికి రూ.57 కోట్లతో కొవ్వాడ ఔట్ ఫాల్‌స్లూయిజ్ నిర్మించడానికి మహానేత వైఎ స్సార్ చర్యలు తీసుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో రూ.17.01 కోట్ల నిధులతో మెట్ట ప్రాంతంలోని 230 గ్రామాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నరసాపురంలో పేదలకు గూడు కల్పించడానికి రూ.10 కోట్లతో సుమారు 600 మందికి ఇళ్లు నిర్మించారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులను మహానేత మంజూరు చేశారు. అయితే ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాం త ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ముంపు ముప్పును తొలగించారు
జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్‌మెంట్ నిర్మించడానికి వైఎస్ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుంచి బయట పడగలి గారు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి వైఎస్ కోట్లాది నిధులు మంజూరు చేశారు. ఏలూరు నియోజకవర్గంలో 10 వేలకు పైగా పేద కుటుంబాలకు స్థలాలు మంజూరు చేయడమే కాకుండా వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. జిల్లాలో ఏ ప్రాంతంలో అడుగు వేసినా వైఎస్ తాలూకు అభివృద్ధి మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే జిల్లాను ఆయన మానసపుత్రిగా అభివర్ణించడంలో సందేహించాల్సిన పనే లేదు.