
కదంతొక్కిన కర్షకులు
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు సంఘీభావంగా వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు, పార్టీ నాయకులు బుధవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతమైంది. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే తొలుత నష్టం రైతుకేనన్నారు. ప్రస్తుతం కాస్తో.. కూస్తో తడుస్తున్న పంట పొలాలు సైతం బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ సీపీ పిలుపు మేరకు రైతులు కదిలి రావడం అభినందనీయమన్నారు.
ర్యాలీలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఖాజా, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నాయకులు సింగరాజు వెంకట్రావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. దర్శిలో తాజామాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడి ఆధ్వర్యంలో ట్రాక్లర్ల ర్యాలీ నిర్వహించారు. గడియారస్తంభం సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన ఆగిందంటే వైఎస్సార్‌సీపీ, ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలే కారణమన్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని అన్ని ఫ్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ఇప్పటికైనా సీమాంధ్ర ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
యర్రగొండపాలెంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు పాల్గొన్నారు. భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. మార్కాపురం నియోజకవర్గ ట్రాక్టర్ల ర్యాలీ పొదిలిలో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులను విస్మరించిన పార్టీలకు పుట్టగతులుండవంటూ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి హెచ్చరించారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని, అటువంటినాయకుడి అడుగుజాడల్లో నడవడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, సజ్జాహేమలత, ఎడం చినరోశయ్యలు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సమైక్యాంధ్రకు సంఘీభావంగా నినాదాలు చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టు
సమైక్యాంధ్రకు ఎమ్మెల్యే మద్దతు తెలపాలని డిమాండ్ చేసినందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారని తెలిసి ‘ఎమ్మెల్యే సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలి’ అని నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆందోళనకారులపై నోటి దురుసుతనం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీని విమర్శించడంతో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని చెంచిరెడ్డిని జీపు ఎక్కించేందుకు యత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను నడిపించుకుని స్టేషన్ వైపునకు తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. ఒంగోలు రూరల్ సీఐ భూషణం హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకు దిగిన 11 మంది వైఎస్‌ఆర్ సీపీ నాయకులను అరెస్టుచేసి నాలుగు గంటలపాటు స్టేషన్‌లోనే ఉంచుకొని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడం గమనార్హం.