డ్రామాలొద్దు | YSR Congress Party Open Letter to Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

డ్రామాలొద్దు

Published Thu, Aug 22 2013 1:13 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

YSR Congress Party Open Letter to Chandrababu Naidu

* చంద్రబాబూ.. విభజన లేఖ వెనక్కి తీసుకోండి
* రాజీనామా చేయండి..  మీ ఎమ్మెల్యేలతో చేయించండి
* వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ
* మీ మీద ఎవరో కుట్ర చేస్తున్నారని ఎందుకంత గింజుకుంటున్నారు?
* గింజుకునే బదులు మీరు రాజీనామా చే యండి.. మీ ఎమ్మెల్యేల చేతా చేయించండి
* కాంగ్రెస్‌తో చేతులు కలిపింది మీరు కాదా?
* కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా.. మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు
* విభజన జరిగితే కృష్ణా ఆయకట్టులో గొడవలేగా!
* హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చేస్తే.. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు?
 
సాక్షి, హైదరాబాద్: తమపై వారు కుట్ర చేశారు.. వీరు కుట్ర చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకునే బదులు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయన కేంద్రానికి రాసిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, మేకతోటి సుచరిత ఈ మేరకు బుధవారం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా చరిత్రహీనులుగా మిగిలిపోకుండా బాబు తాను రాజీనామా చేయడంతో పాటుగా తమ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా చేయించాలని కోరారు. ‘‘అలా చేస్తే మీకు అంతో ఇంతో గౌరవం మిగులుతుంది. మీరు చేయాల్సిన పని చేయకుండా అందరినీ దూషించడం వల్ల మీరే పలుచన అవుతారు’’ అని బాబుకు హితవు పలికారు.
 
చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ పూర్తి పాఠం
అవిశ్వాసంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది మీరు కాదా?
‘‘తమ మీద వారు కుట్ర చేశారు.. వీరు కుట్ర చేశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు అంతగా గింజుకుంటున్నారు? టీడీపీ అక్కడా, ఇక్కడా, ఎక్కడా లేకుండా చేయాలని కుట్ర పన్నారని బాబు అంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత దుస్థితిలో ఉందంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. అందుకు కారణం ఆయనకు విశ్వసనీయత లేకపోవడం.

రిటైల్  రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే బిల్లు మీద రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్నపుడు ఈ దేశ ప్రజల తరఫున నిలబడకుండా, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై మీరు మీ ఎంపీలను గైర్హాజరు చేయించటం నిజం కాదా అని మేం అడుగుతున్నాం. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విసుగెత్తి.. అన్ని ప్రతిపక్ష పార్టీలూ అవిశ్వాసం ప్రవేశపెడితే మీరు మాత్రం ఏకంగా విప్ జారీ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు.

చంద్రబాబూ.. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నదేమిటి? కాంగ్రెస్ వారేమో ఓట్ల కోసమని, సీట్ల కోసమని క్రెడిట్ కోసమని రాష్ట్రాన్ని విభజిస్తుంటే.. అన్యాయం జరుగుతోందని తెలిసి స్పందించవలసిన మీరు ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ రాకుండా పోతుందేమోనని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు.
 
ఉత్తరం వెనక్కు తీసుకోనని తెగేసి చెప్పారు..
ఏపీ ఎన్జీవోలు మీ వద్దకు వచ్చి అన్యాయం జరుగుతోంది, మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఉత్తరం వెనక్కి తీసుకోండని ప్రాధేయపడినా.. చంద్రబాబూ.. మీరు నిర్దయగా, కనికరం లేకుండా నేను తీసుకోను అని తెగేసి చెప్పారు. మిమ్మల్ని రాజీనామా చేయమని కోరితే రాజీనామా చేయను పొమ్మన్నారు. మీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించండి అని అడిగితే చేయించను పొమ్మన్నారు.

ఇలా రాష్ట్రంలో కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇందుకే దేవుడు, ప్రజలు మిమ్మల్ని ఎక్కడా లేకుండా చేస్తారు. విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు.. విభజన వల్ల జరిగే అన్యాయానికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా?
 
విభజిస్తే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
విభజన జరిగితే కృష్ణ ఆయకట్టులో రోజూ గొడవలే కదా.. ఇప్పటికే పైన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కిందకు నీరు వదలని పరిస్థితి. అలాంటప్పుడు మధ్యలో ఇంకొక రాష్ట్రం ఏర్పాటయితే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి? నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి? కింద ఉన్న రాష్ట్రానికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి?

పోలవరానికి జాతీయ హోదా అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి రెండు రాష్ట్రాలు చేస్తే, ఆ కింది రాష్ట్రానికి నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు?

రాష్ట్ర రాజధానిగా ఆరు దశాబ్దాల నుంచి ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చేస్తే.. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 50 శాతం ఆదాయం అక్కడ నుంచే వస్తున్న పరిస్థితుల్లో, ఆ డబ్బే రాకపోతే ఎలా చేయగలం సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ? ఎలా ఇవ్వగలుగుతారు జీతాలు?

 చదువుకున్న ప్రతి పిల్లవాడు, చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలి?
పైన మేం అడిగినవి చాలా చిన్న అంశాలు, ఇటువంటి వాటికే పరిష్కారం లేనప్పుడు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం తప్పు కాదా?’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement