హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుది కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. 10 లక్షల మందికి పింఛన్లు ఎగనామం పెట్టిన ప్రభుత్వం, 16 లక్షల మందికి రేషన్ కార్డుల్లో కోత విధించిందన్నారు.
హుద్ హుద్ తుపాను వల్ల లక్షలాది ఇళ్లు నేలమట్టం అయినా కొత్తవి మంజూరు చేసింది కేవలం వేలల్లో మాత్రమే అని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రైతుల ఆత్మహత్యలను సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.