సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ నిర్బంధం, చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు సర్వేలపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, రక్షణనిధి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్... సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతల అక్రమ నిర్బంధం, ఓట్ల తొలగింపు అంశాలను సీఈవో దృష్టికి తీసుకు వెళ్లారు.
అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరులో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశాం. మా టాబ్‌లతో వచ్చి సర్వేలు చేయడాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని కోరాం. పోలీసుల సహకారంతో సర్వేలు చేస్తున్నారు. ఎమ్మెల్యేను రాత్రంతా బస్సులో తిప్పి ఉదయం సత్యవేడులో వదిలారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తోంది. అధికారం కోసం ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారు.
ఎన్నికల అధికారులు కూడా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారు. టాబ్‌లతో సమాచారం భద్రపరిచేవాళ్లను వదిలి, ఫిర్యాదు చేసినవాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు అహంకారంతో సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యేను తమిళనాడు తీసుకెళ్లి హింసించారు. చెవిరెడ్డి ఏంతప్పు చేసారని కేసు పెట్టారు. చిత్తూరు ఎకస్పీ మీద చర్యలు తీసుకోవాలి. ఓట్ల తొలగింపు ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన మేరకు చర్యలు తీసుకోవడం లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment