పదో తరగతి పేపర్ల లీకేజిపై దద్దరిల్లిన అసెంబ్లీ
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు గురువారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండోరోజు కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార పక్ష సభ్యులు మాత్రం యథావిధిగా ప్రతిపక్ష సభ్యులను నిందించడానికే తమ ప్రసంగాలను ఉపయోగించుకున్నారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.