రుణవంచనపై రణశంఖం
ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవడానికి నీతి కావాలి. ఆ మాటను నమ్మి ఆదరించిన వారికి న్యాయం చేసేందుకు నిబద్ధత కావాలి. టీడీపీ సర్కారులో ఆ రెండింటినీ కాగడా వేసి వెతకాల్సిన పరిస్థితి. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని ఎగ్గొట్టేందుకు మార్గాలను వెతుకుతున్న ముఖ్యమంత్రి ఆ క్రమంలోనే రైతు రుణమాఫీకి రోజుకో మెలిక పెడుతూ నెలల తరబడి అన్నదాతల్ని నలిపేశారు. తాజాగా ప్రకటన చేసి, ఉద్ధరించినట్టు చెప్పుకొంటున్నా.. అర్హులైన ఎందరికో మాఫీ లబ్ధి అందని మాని పండే అవుతోంది. సర్కారు వంచనా పరంపరపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరిస్తోంది. జనం తరఫున కదనానికి కదులుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రుణమాఫీపై ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట. డ్వాక్రా సంఘాల రుణాలు, వ్యవసాయ రుణాలు అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాఫీపై కొర్రీలపై కొర్రీలు వేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు తొలి విడతగా మాఫీ చేస్తామని గురువారం ప్రకటించారు. జిల్లాలో 3.60 లక్షల మంది పంట రుణాలు, 4.50 లక్షల మంది బంగారంపై రుణాలు తీసుకున్నారు. ఈ 8.10 లక్షల మంది రైతులు చంద్రబాబు హామీని నమ్మి రుణాలు చెల్లించలేదు. గత కొంత కాలంగా వారిని తీవ్రమైన ఊగిసలాటలోకి నెట్టిన చంద్రబాబు ఇప్పుడు తొలివిడతగా రూ.50 వేల లోపు రుణాలకే మాఫీని పరిమితం చేస్తామంటున్నారు.
ఇప్పటికే పలువురి పేర్ల తొలగింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 50 శాతం మంది రైతులను పలు కారణాలతో మాఫీకి అర్హుల జాబితా నుంచి తొలగించేశారు. ఆ లెక్కన.. జిల్లాలో పంట రుణాలు తీసుకున్న 3.60 లక్షల మంది రైతుల్లో సుమారు లక్షన్నర మందిపైబడే రైతులు మాఫీకి దూరమైనట్టే. మిగిలిన వారిలో కూడా మరో 25 శాతం మంది (ఒక రైతు రెండు బ్యాంకులలో రుణం తీసుకుని ఉండటం, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న నిబంధన వల్ల)ని తొలగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుంటే జిల్లాలో 3.60 లక్షల మంది తీసుకున్న పంట రుణాలు రూ.2,350 కోట్లలో నాలుగైదు వందల కోట్లు మించి మాఫీ కాదంటున్నారు.
అనేకులకు అడియాసే..
నిన్న మొన్నటి వరకు పంట రుణాలన్నీ మాఫీ అవుతాయనుకున్న రైతుల ఆశలు కాస్తా చంద్రబాబు శుక్రవారం నాటి ప్రకటనతో నీరుగారిపోయాయి. ఈ వేళ కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు మాఫీ చేస్తారనుకున్న రైతులు నిస్పృహకు లోనయ్యారు. రుణమాఫీపై మాట తప్పి దగా చేసినందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ బాధ్యతగా ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ఉద్యమం విజయవంతానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జిల్లా ముఖ్యనేతల సమన్వయంతో సన్నాహాలు చేస్తున్నారు.
కాకినాడ సూర్యకళామందిరంలో గత ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన రాష్ట్ర నేతలు కూడా ఈ ఆందోళనపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రైతులను సర్కార్ మోసగించిన వైనాన్ని పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు గ్రామగ్రామాన వివరిస్తూ ప్రచారం చేశారు. వెన్నంటి ఉంటామంటూ భరోసా కల్పించారు. దీంతో శుక్రవారం నాటి ధర్నాకు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచీ రైతులు, డ్వాక్రా మహిళలు తరలివచ్చి సర్కార్‌పై నిరసన తెలియచేసేందుకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీని అమలు చేసే వరకు ప్రభుత్వంపై నిరంతరం పోరుకు ప్రజా భాగస్వామ్యంతో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. శుక్రవారం తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.