సాక్షి ప్రతినిధి, కడప: కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఓట్లు...సీట్లు మదిలో మెదిలాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇందుకు వంతపాడింది. ప్రజాభీష్టంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయానికి మొగ్గుచూపారు. దీనిని నిరసిస్తూ పలువురు ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పెద్దల నిర్ణయంలో మార్పు కానరాలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రోడ్లపెకొచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతిని ప్రదర్శిస్తున్నాయి. తాము ప్రజాపక్షమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. పదవులే కాదు అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేస్తామంటూ కార్యకర్తల నుంచి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాకా నినదించి ఆచరణలో చూపెడుతున్నారు.
ప్రజామద్దతును దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేపింది. ఎంపీ సీట్లను సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఆంధ్రప్రదేశ్ విభజనకు శ్రీకారం చుట్టింది. బలమైన రాజకీయ శత్రువును ఎదుర్కోలేక కుయుక్తులకు పాల్పడింది. బాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. అండగా నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విభజన నిర్ణయాన్ని సమర్థిస్తోంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించకుండా రూ.5లక్షల కోట్లు కొత్త రాజధానికి అవసరమంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ అండతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారి నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రత్యక్షపోరులో వైఎస్సార్‌సీపీ.....
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజన చేసే విషయంలో సమన్యాయం పాటించాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆమేరకు ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా భావించారు. 16 మంది సామూహికంగా రాజీనామాలు చేశారు. అదే పంధాను ఆపార్టీలోని సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ృౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వరకూ తీసుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఆపార్టీ నేతలు సమైక్యం కోసం ఉద్యమాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం అదే ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రజాపక్షమే తమ అభిమతమని పేర్కొంటోంది.
ఆమరణదీక్షలతో ఊపుందుకున్న ఉద్యమం....
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితోబాటు, హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్ ఆమరణదీక్షలను చేపట్టారు. వెనువెంటనే రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తాము సైతం అంటూ వారి ప్రాంతాలలో దీక్షలు చేపట్టారు. ఏడు రోజులుగా కడపలో దీక్షలను చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు బలవంతంగా రిమ్స్ ఆప్పత్రికి తరలించారు. పార్టీ నాయకుల స్పూర్తిని కొనసాగించేందుకు వైఎస్సార్‌సీపీ యువతరం ముందుకొచ్చింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప సమన్వయకర్త ఎస్‌బీ అంజాద్‌బాష, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు ఎస్ నాగిరెడ్డి ఆమరణదీక్షకు ప్రతినబూనారు. వీరితోబాటు మెడికల్ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మేసా ప్రసాద్, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి దీక్షలను కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆమరణదీక్షలతో ఒక్కమారుగా జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. వారికి తోడు నీడగా వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరాటం చేస్తోంది. అదే స్పూర్తిని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆచరణలో చూపితే రాష్ట్ర విభజన విషయృంలో ఏఐసీసీ నాయకులు వెనకడుగు వేయకతప్పదని పలువురు భావిస్తున్నారు.
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరాటం
Published Tue, Aug 20 2013 6:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement