వైఎస్సార్ సీపీలోకి విద్యాసాగర్
=హైదరాబాదులో వైఎస్ జగన్ సమక్షంలో చేరిక
=బందరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌గా నియామకం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. హైదరాబాదులో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, బందరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనరుగా ఆయన్ని నియమిస్తున్నట్టు అధినేత ప్రకటించారు. దివంగత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో కాంగ్రెస్‌లో చేరిన కేఎన్నార్ జెడ్పీ చైర్మన్ పదవిని అధిష్టించి అనతికాలంలోనే జిల్లా రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే.
వైఎస్ మరణంతో ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు కేఎన్నార్ పామర్రులో జరిగిన సభలో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా కుక్కల నాగేశ్వరరావు జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేశారు. నవంబరు 21న ఆయన గుండెపోటుతో మృతి చెందటం ఆ పార్టీ శ్రేణులతో పాటు జిల్లా వాసులను ఆవేదనకు గురిచేసింది. నవంబరు 22న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసూరు వచ్చి కేఎన్నార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అదే సందర్భంలో కేఎన్నార్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు తన తండ్రి ఆశయాలను కొనసాగించాలన్న తలంపుతో కేఎన్నార్ పెద్ద కుమారుడు విద్యాసాగర్ వైఎస్సార్ సీపీలో చేరేందుకు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో అధినేత సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, బందరు, గుడివాడ, పెనమలూరు, పామర్రు, పెడన అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పేర్ని నాని, కొడాలి నాని, పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, ఉప్పులేటి కల్పన, ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము తదితరులు విద్యాసాగర్‌కు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పారు. విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని తెలిపారు.