‘ఏపీ నాశనానికి చంద్రబాబు కంకణం’ | YSRCP Leader Ummareddy Venkateswarlu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Published Sun, Mar 15 2020 8:32 PM | Last Updated on Sun, Mar 15 2020 8:53 PM

YSRCP Leader Ummareddy Venkateswarlu Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్లకు పైగా నిధులు ఆగిపోతున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే అంశం అని పేర్కొన్నారు. కరోనా బూచి చూపించి ఎన్నికలను వాయిదా వేయడం దారుణమన్నారు. అసలు ఏపీలో కరోనా వైరస్‌ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు.
(‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’)

ఎలా వాయిదా వేస్తారు..?
కనీసం హెల్త్ సెక్రటరీ,  సీఎస్ ను సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం సరికాదన్నారు. రాజ్యాంగ విలువలు పాటించలేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. రాజ్యాంగ విలువలు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసంతో ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావని తెలిసి కుట్రపూరితంగా ఎన్నికలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన నీచపు పనిని ఆయన సమర్థించుకోవడం సిగ్గుచేటని  దుయ్యబట్టారు.
(బెదిరించ లేదు, ఇది వాస్తవం: అంబటి)

చంద్రబాబుకు కడుపు మండి పోతుంది..
‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో  రాష్ట్రం అభివృద్ధి పథాన నడవడం చూసి చంద్రబాబుకు కడుపుమండిపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని’ ఆయన  విమర్శించారు. ‘‘చంద్రబాబు హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవాలు జరగలేదా.. గతంలో 23 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి.. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది నువ్వు కాదా’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి వాయిదా వేయించిన అసమర్థుడిగా చంద్రబాబును ఉమ్మారెడ్డి అభివర్ణించారు. ‘‘ప్రజా బలంతో 151 స్థానాలు సాధించాం. సీఎం వైఎస్‌ జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్‌ కుమార్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement