
'తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు'
ఏలూరు: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నదన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా తాను చేసిన తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. బెల్టు షాపులను తొలగిస్తామని తొలి సంతకం చేసిన తర్వాత నాలుగు వేల మద్యం షాపులు, 40 వేల బెల్టు షాపులు పెరిగాయన్నారు. దశలవారీగా మద్య నిషేధమని సంతకం చేసి గతంలో మద్యం ఆదాయాన్ని రూ.10వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు పెంచుకున్నారని, రుణమాఫీ సంతకమంటూ కోటయ్య కమిటీకి సంతకం చేశారన్నారు. రూ.86 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.9వేల కోట్లే మాఫీ చేసి మోసం చేశారని వారు తెలిపారు.
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు దౌర్బ్యాగపు పరిపాలనే కారణమన్నారు. ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం చేసి చంద్రబాబు ముస్లింలను అవమానపరిచారని, నారోడ్లు, నా పెన్షన్ అంటూ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడతున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలు, గిరిజనులకు కేబినెట్‌లో ప్రాతినిధ్య లేకుండా చేశారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని గవర్నర్, స్పీకర్ వ్యవస్ధలను అపహాస్యం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం అంచనాలు పెంచి దోపిడీకి తెగబడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో పశ్చిమలో 15 అసెంబ్లీ స్ధానాలు వైఎస్సార్సీపీవేనని ఉమ్మారెడ్డి, నాని ఆశాభావం వ్యక్తం చేశారు.