
క్షుధార్తుల కోసం లక్ష కిలోల బియ్యం
జగ్గంపేట : కడలి తీరంలో కళకళలాడిన మహానగరం విశాఖపట్నం.. ఆ కడలిలోనే పుట్టిన ముప్పుతో కళా విహీనమైంది. ఏకకాలంలో జల, వాయుఖడ్గాలతో విరుచుకుపడి, హుదూద్ జరిపిన దాడితో.. ఇప్పుడా నగరంలో ఎక్కడ చూసినా శోకం, చీకటి, ఆకలి తాండవిస్తున్నాయి. మానవత్వం కలిగిన వారి హృదయాల్ని కదిస్తున్నాయి. చేయూతనిచ్చేందుకు కదిలి వచ్చేలా చేస్తున్నాయి. అదిగో.. ఆ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, జిల్లా పరిషత్‌లో ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ చలించిపోయారు. విశాఖలో లక్షలమంది ప్రజల క్షుద్బాధను తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. తాను నిర్వహిస్తున్న ‘వైఎస్ జగన్ ఆపన్నహస్తం’ స్వచ్ఛంద సంస్థ తరఫున లక్ష కిలోల బియ్యం సేకరించి, విశాఖలో పేదలు నివసించే ఒక ప్రాంతంలో అయిదువేల కుటుంబాలకు 20 కిలోల చొప్పున పంచాలని నిశ్చయించుకున్నారు.
మూడు, నాలుగురోజుల్లోనే బియ్యం వారికి అందజేయాలన్న ధ్యేయంతో ఆదివారం సాయంత్రం జగ్గంపేటలో బియ్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని జీతాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగో తరగతి ఉద్యోగుల్లో సుమారు 1400 మందికి బియ్యం, నిత్యావసర సరుకులను ‘వైఎస్ జగన్ ఆపన్నహస్తం’ తరఫున గతంలో అందజేసినట్టు చెప్పారు. ఇప్పుడు విశాఖలో హూదూద్ బాధితులకు లక్ష కిలోల బియ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మానవతావాదులు తన సంకల్పం సాకారమయ్యేందుకు సహకరించాలని కోరారు. బియ్యం సేకరణకు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తామని, దాతలు తన మొబైల్ నం: 98662 58888లో సంప్రదించాలని చెప్పారు. నవీన్‌కుమార్ సంకల్పాన్ని అభినందిస్తూ గ్రామానికి చెందిన కొత్త కొండబాబు 500 కిలోల బియ్యం అందజేశారు. కార్యకమంలో వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, కొండబాబు, ఒమ్మి రఘురామ్, నీలాద్రిరాజు, వెలిశెల్లి శ్రీను, డ్రిల్ మాస్టారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.