సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ వ్యవహారం విధానపరమైన నిర్ణయమని అంబటి స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఆయన మనిషి పోతున్నాడని చంద్రబాబు బాధపడుతున్నారని అన్నారు. విధానపరమైన నిర్ణయంపై టీడీపీ నేతలకు ఉన్న అభ్యరంతమేమిటని ప్రశ్నించారు.
గతంలో ఏకసభ్య కమిషన్ ఉండేదని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులు ఉండేలా నిర్ణయించారని తెలిపారు. వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. వ్యవస్థ బాగుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 243కె నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన పదవి మూడేళ్లకు తగ్గిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించారని తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామికంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మంచి జరుగుతుంటే చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంపలు మునిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలో మార్పులు సహజం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment