
స్పష్టత లేని కార్యక్రమాలెందుకు?
బాబు కార్యక్రమాలపై వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెడుతున్న జన్మభూమి కార్యక్రమం ఆయన కేబినెట్‌లోని మంత్రులకే అర్థం కావడంలేదని, అవి ప్రజలకేమి అర్థమవుతాయని, వాటి వల్ల కలిగే ప్రయోజనమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. శనివారం డ్వాక్రా మహిళలతో బాబు ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టత కోరడం, వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం చూస్తే వాటిపై ప్రభుత్వంలోని పెద్దలకే స్పష్టత లేదని తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఉప్పులేటి కల్పన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా ఒక దళిత మంత్రి పైనే నోరు పారేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలపై ఆయనకే స్పష్టత లేదని అర్థమవుతుంది’ అని ఎద్దేవా చేశారు.