భయపెట్టడానికే అక్రమ కేసులు | ysrcp spokesman Ambati banner | Sakshi
Sakshi News home page

భయపెట్టడానికే అక్రమ కేసులు

Published Fri, Jan 9 2015 2:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

భయపెట్టడానికే అక్రమ కేసులు - Sakshi

భయపెట్టడానికే అక్రమ కేసులు

  • వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం
  • రాజధాని గ్రామాల్లో పార్టీ నియమిత కమిటీ పర్యటన
  • వేధింపులు ఎదుర్కొంటున్న రైతులతో నేతల భేటీ
  • సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుర్తుతెలియని దుండగులు ఆరు గ్రామాల్లోని 13 చోట్ల పంట పొలాల్లో నిప్పు పెట్టిన నాటి నుంచి పెరిగిన పోలీసు జోక్యం, విచారణ పేరుతో మొదలైన వేధింపులు కారణంగా రాజధాని ప్రాంత రైతు కుటుంబాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ రాజధాని గ్రామాల రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేతలు గురువారం పర్యటించారు. వేధింపులు ఎదుర్కొన్నవారి నివాసాలకు వెళ్లి పోలీసుల దుర్నీతిని తెలుసుకున్నారు.

    తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలియజేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న వేధింపులను వివరించారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో జరిగిన సభలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులు, తెలుగు తమ్ముళ్ళు కలిసి సంయుక్తంగా పచ్చని పంట పొలాల్లో నిప్పు పెట్టి ఉంటారన్నారు.

    రాజధాని గ్రామాల్లో పోలీసులు ప్రవేశించడానికి వీలుగానే వారీ నీతిమాలిన పనికి పాల్పడి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రైతుల ఇష్టానికి విరుద్ధంగా వారి భూమిని తీసుకునే అధికారం ఎవరికీ లేదని, అదే జరిగితే చైన్ స్నాచర్‌కు, చంద్రబాబుకూ ఎలాంటి తేడా ఉండదని వ్యాఖ్యానించారు. మానసికంగా భయపెట్టడానికే అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ, మీరు సంఘటితంగా ఉద్యమిస్తే వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ పార్టీ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సందర్భాన్ని బట్టి జగన్‌మోహన్‌రెడ్డి సైతం గ్రామాల్లో పర్యటిస్తారని హామీ ఇచ్చారు.

    మాజీ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటికైనా అఖిలపక్షం వేసి అందరితో చర్చించాలని డిమాండ్ చేశారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. అమాయకులైన రైతుల వద్ద ఎలాగైనా భూమి గుంజుకునేందుకే పాలకులు ఎత్తుగడలు పన్నుతున్నారన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాబు ఇక ఎంతో కాలం సీఎంగా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీకి ఓటేయొద్దని వీధి వీధీ తిరిగి చెప్పామనీ, ఇప్పుడదే పార్టీ అధికారం చేపట్టిన ఫలితాన్ని అందరం అనుభవిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కోన రఘుప తి, కొడాలి నాని, రక్షణనిధి, మొహమ్మద్ ముస్తఫాలు పాల్గొన్నారు.

    నాయకుడి ఆదేశాల మేరకే నిప్పు పెట్టినట్లు ఒప్పుకోమన్నారు..

    ‘రాజధాని నిర్మాణానికి నా భూమి ఇవ్వననడమే నేను చేసిన నేరం. వైఎస్‌ఆర్‌సీపీలో తిరగడమే నా పాపం. దీనికే పోలీసులు నన్ను నిర్బంధిం చారు. మా నాయకుడి ఆదేశాల మేరకే నేను పంట పొలాల్లో నిప్పు పెట్టినట్లు ఒప్పుకోమన్నారు. బూతులు తిట్టారు. అవమానంతో చచ్చిపోదామనుకున్నాను. కానీ కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయా..’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు
     
    మా అబ్బాయిపై దొంగ కేసు బనాయించారు..

    ‘మా అబ్బాయిని పోలీసులమని చెప్పి పదిరోజుల క్రితం కొందరు తీసుకెళ్ళారు. ఎక్కడుంచారో కూడా తెలీకుండా రకరకాల పోలీసుస్టేషన్లు మార్చుకుంటూ చివరకు సత్తెనపల్లిలో ఉన్నట్లు చూపించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వమన్నందుకు.. రైతుల్లో విద్వేషాలు రగుల్చుతున్నాడనీ, మీడియాకు, అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడనీ దొంగ కేసు బనాయించారు..’ అని ఇప్పటికీ పోలీసుల చెర నుంచి విడుదల కాని లింగాయపాలెంకు చెందిన శ్రీనాధ్‌చౌదరి తండ్రి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement