వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఖాయం
ఫ్యాన్ గుర్తును ప్రతి గడపకూ పరిచయం చేయండి
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
సమన్వయకర్తల సమావేశంలో ప్రణాళిక రూపకల్పన
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్
నాలుగేళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుట్రలు పన్ని నిలిపి వేసిన స్థానిక ఎన్నికలను ఎట్టకేలకు సుప్రీంకోర్టు మొట్టికాయలతో ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఆదివారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయకర్తలు, కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు ఏవిధంగా కృషిచేయాలో ప్రణాళికను రూపొందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల నగారా మోగినందున తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ కేవలం ప్రజాసేవ, ప్రజల సంక్షేమం దిశగా ఎన్నికల బరిలోకి దిగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేయటం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికలలో మాచర్ల, ప్రత్తిపాడుల్లో వచ్చిన భారీ మెజారిటీ నేడు రానున్న ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వస్తుందన్నారు. పార్టీ సింబల్ ఫ్యాను గుర్తుపైనే ఎన్నికలు జరుగనున్నాయన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళిక సిద్ధమైందని , కారకర్తలు నాయకులు పార్టీ గుర్తు ఫ్యాను సింబల్‌ను ప్రతి ఓటరుకు పరిచయం చేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నాలుగేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు భయపడ్డ ప్రభుత్వం గత్యంతరంలేక కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు రకాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కేవలం కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే ఈవిధంగా జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నీచమైన కుట్రలను ప్రజలు గమనించారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తెలిపారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. రాజన్న కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, కోన రఘుపతి, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, జంగా కృష్ణమూర్తి, నన్నపనేని సుధ, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర సురేష్‌కుమార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, పార్టీ నాయకులు గోగినేని శ్రీనివాసరెడ్డి, గుదిబండ చిన వెంకటరెడ్డి, ముస్తఫా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.