అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు | YSRCP will be assembling at Ambedkar Statue to garland the statue | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు

Published Fri, Dec 18 2015 2:18 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు - Sakshi

అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను టీడీపీ అసెంబ్లీ వేదికగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ..

వైఎస్సార్‌సీపీ నిర్ణయం

  • హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న జగన్

 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను టీడీపీ అసెంబ్లీ వేదికగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ముత్తిరేవుల సునీల్ ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని చర్చకు రానీయకుండా అంబే డ్కర్ మహాశయుని గురించి, రాజ్యాంగం గురించి చర్చిద్దామని ఉన్నపళంగా టీడీపీ ప్రతిపాదించడంపట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు. అంతేగాక వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి, తమ పార్టీ ఎమ్మెల్యేలకు అంబేడ్కర్ అంటే గౌరవం లేదంటూ టీడీపీ నేతలు మాట్లాడుతుండడాన్ని తప్పుపట్టారు.

తమకు, తమ నేత జగన్‌కు అంబేడ్కర్ అంటే అపారమైన గౌరవముందని, ఆ మహాశయుడు రచించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గతనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జరిపి ఆయన ఆశయాల్ని స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. నిజానికి అంబేడ్కర్‌ను రాజకీయంగా వాడుకోజూసింది టీడీపీయేనని వారు స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్ తపించార ని, అలాంటి మహానుభావుడ్ని అడ్డంపెట్టి మహిళల మాన,ప్రాణాలను భక్షించిన కాల్‌మనీ రాకెట్‌పై చర్చించకుండా అడ్డుపడ్డారని వారన్నారు. వాస్తవానికి కాల్‌మనీపై చర్చించి దోషుల్ని శిక్షించేలా నిర్ణయం తీసుకునిఉంటే అది అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అయ్యేదన్నారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇరుక్కుని చిక్కుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు అంబేడ్కర్‌ను అడ్డు పెట్టుకున్నది టీడీపీయేనన్నారు. ఇటీవలి జనచైతన్యయాత్రల సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో మంత్రి రావెల కిషోర్‌బాబు బూటుకాళ్లతోనే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారని(కల్పన ఆ ఫొటోను చూపుతూ..) దీన్ని బట్టి టీడీపీ వారికి ఆ మహనీయుడంటే ఎంత భక్తి, గౌరవముందో అర్థమవుతోందన్నారు. రావెల, పీతల సుజాత ఇద్దరూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 నేడు అంబేడ్కర్ విగ్రహానికి జగన్ పాలాభిషేకం
 ఇదిలా ఉండగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లడానికి ముందు ఉదయం 8.15 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పాల్గొంటారని సునీల్ తెలిపారు. పార్టీ  ఎమ్మెల్యేలందరూ హాజరవుతారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement