సాక్షి, సంగారెడ్డి: కొండను తవ్వి ఎలుకను పట్టిన చందగా మారింది జిల్లా పరిషత్ యంత్రాంగం తీరు. స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల వినియోగంపై జిల్లా పరిషత్ అధికారులు నిర్వహించిన భారీ కసరత్తు తుస్సుమంది. వివిధ పద్దుల కింద గడిచిన మూడేళ్లలో మంజూరైన వేల పనుల పురోగతిపై అధ్యయనం చేసి అందులో కేవలం 143 పనులు మాత్రమే ప్రారంభానికి నోచుకోలేదని తెలిసి చేతులు దులుపుకుంది. అదే విధంగా 77 పనుల రద్దుకు మాత్రమే సిఫారసు చేసింది. ప్రారంభం కాని పనులను ప్రారంభమైనట్లు, ప్రారంభమైనా పూర్తికాని పనులు పూర్తయినట్లు చూపించి ‘లేని పురోగతి’ని కాగితాలపై చూపించారనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్‌జీఎఫ్), జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల సాధారణ నిధుల, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు(ఎస్‌ఎఫ్‌సీ), 13వ ఆర్థిక సంఘం(టీఎఫ్‌సీ) నిధులతో కింద 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన పనుల స్థితిగతులపై మరోమారు సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జడ్పీ సీఈఓ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఎస్‌ఈలకు ఆదేశించారు. దీంతో వారం రోజులుగా జడ్పీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలను తయారు చేసింది.
ఈ మూడేళ్ల కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయినట్లు తేల్చింది. ఇంకా 1524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు మాత్రమే ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని తేల్చింది. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం సాధ్యం కాని 77 పనుల రద్దుకు సిఫారసు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్), ఎంపీడీఓల నిర్లక్ష్యానికి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలు తోడు కావడంతో నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనుల సంఖ్య ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఎంపీడీఓలు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తప్పుడు సమాచారం ఇచ్చి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు డెడ్‌లైన్లు
గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో పనులన్నింటినీ వచ్చే ఏడాది జనవరి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డెడ్‌లైన్ విధించారు. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని గడువు పెట్టారు. అయితే, గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో ఉన్న 1,342 పనులను జనవరి 31లోగా పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు సమ్మతం తెలిపారు.
ఉసూరుమన్న కసరత్తు
Published Wed, Dec 18 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement