సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ కమిషన్ బిల్లులపై శాసన మండలిలో మంగళవారం వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులను స్వాగతిస్తున్నామంటూనే.. విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించి ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో ఇంగ్లిష్ మీడియం బిల్లులో తెలుగు మీడియం ఆప్షన్ పెట్టాలని, ఎస్సీ కమిషన్ బిల్లులో వర్గీకరణ అంశాన్ని పెట్టాలన్న సవరణలతో బిల్లును మండలిలో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982కు సవరణ తెస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు మంత్రి ఆదిమూలపు సురేష్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలో పాల్గొన్న పి. అశోక్‌కుమార్(టీడీపీ), మాధవ్ (బీజేపీ), విఠపు బాలసుబ్రహ్మణ్యం(పీడీఎఫ్) ఇంగ్లిష్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థులకు తెలుగు మాధ్యమం కూడా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని సవరణను ప్రతిపాదించారు.
దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పేదలు ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కుతూ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. టీడీపీకి అనుకూలమైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకించని ప్రతిపక్షాలు.. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం పెడితే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగును తాము నిర్లక్ష్యం చేయడంలేదని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని వివరించారు.
దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు బంగారు భవిత ఇవ్వబోతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సవరణకు పట్టుబట్టడంతో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. విపక్ష సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో వారు ప్రతిపాదించినట్లు తెలుగు మాధ్యమం ఉండాలనే సవరణతో బిల్లును ఆమోదించారు.
ఎస్సీ కమిషన్ బిల్లుకు వర్గీకరణ మెలికపెట్టిన టీడీపీ
ఎస్టీ కమిషన్ బిల్లుకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపిన టీడీపీ సభ్యులు, ఎస్సీ కమిషన్ బిల్లులో మాత్రం వర్గీకరణ అంశాన్ని మెలికపెట్టారు. తమ ప్రతిపాదనను బిల్లులో చేర్చాలని టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్, పలువురు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ సుప్రీం కోర్టు రద్దు చేసిందని, అటువంటి అంశాన్ని ఎస్సీ కమిషన్ బిల్లుకు ముడిపెట్టి అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సరికాదని ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, మంత్రి పినిపే విశ్వరూప్, సభ్యులు జంగా కృష్ణమూర్తి, చల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. అయినా విపక్షం ఓటింగ్‌కు పట్టుబట్టడంతో వర్గీకరణ అంశాన్ని చేర్చి సవరణతో బిల్లును ఆమోదించారు. అసెంబ్లీ ఆమోదించిన 16 బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించిన రెండు బిల్లులు మినహా మిగిలిన 14 బిల్లులను మండలి ఆమోదించింది.
ఒక పార్టీకి రెండు వైఖరులా?
ఒక పార్టీకి ఎక్కడైనా ఒకే విధానం ఉండటం చూశానని, కానీ టీడీపీకి శాసనసభలో ఒక మాట, శాసన మండలిలో మరొక మాట చెబుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఎస్సీ కమిషన్, ఇంగ్లిష్ మీడియం బిల్లులపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆమోదిస్తే.. ఆ పార్టీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ కమిషన్ బిల్లుతో పేదలకు మేలు చేసే కార్యక్రమానికి, విద్యా చట్టం సవరణ బిల్లుతో పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులను బొత్స కోరారు.
Comments
Please login to add a commentAdd a comment