విలీన ప్రతిపాదనపై ఏసీసీ, అంబుజా కసరత్తు
న్యూఢిల్లీ: సిమెంటు ఉత్పత్తిలో అంతర్జాతీయ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్‌లో భాగమైన దేశీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ విలీన ప్రతిపాదనపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేయాలని ఇరు కంపెనీలు శుక్రవారం తమ తమ బోర్డ్‌ల సమావేశాల్లో నిర్ణయించాయి. వ్యాపారాల విలీనంతో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరగలదనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఇందుకోసం డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి.
ఒకవేళ ప్రతిపాదిత విలీనం సాకారమైన పక్షంలో ఏర్పడే కొత్త సంస్థ టర్నోవరు దాదాపు రూ. 20,425 కోట్లకు పైగా ఉంటుంది. ముంబైకి చెందిన ఏసీసీ 2016లో (జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) రూ. 11,158 కోట్ల ఆదాయం ఆర్జించగా.. అంబుజా సిమెంటు రూ. 9,268 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 63 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో విలీన కంపెనీ సిమెంటు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న అల్ట్రాటెక్ తర్వాతి స్థానాన్ని దక్కించుకోనుంది. విలీన అవకాశాల వార్తలతో ఫిబ్రవరిలో ఏసీసీ, అంబుజా సిమెంట్ స్టాక్స్ గణనీయంగా లాభపడ్డాయి.