ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తున్న అరుణ్ జైట్లీ. చిత్రంలో సునీల్ మిట్టల్, ఉదయ్ కొటక్
• ఫోన్ నంబరే అకౌంటు నంబరు
• సేవింగ్స్ డిపాజిట్లపై 7.25% వడ్డీ
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్తాన్‌లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రాథమికంగా రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని, దేశవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని భారతీ ఎంటర్‌ప్రైజస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ టెలికం వినియోగదారుల సంఖ్య 26 కోట్లుగా ఉంది.
ఈ యూజర్ల ఊతంతో కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. కస్టమర్ల ఫోన్ నంబర్‌నే బ్యాంకు ఖాతా నంబరుగా కూడా ఉపయోగించుకోవచ్చని సునీల్ మిట్టల్ తెలిపారు. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై వార్షికంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 కంపెనీలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులిచ్చింది. అయితే, చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా సంస్థలు తమ లైసెన్సులను తిరిగిచ్చేశాయి.
జియో ఉచితంతో తీవ్ర ప్రభావం: మిట్టల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ టెలికం రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ విరుచుకుపడ్డారు. మార్కెట్లో అనుచిత పోటీ తప్పడం లేదన్నారు. దేన్నైనా ఉచితంగా కానీ, తక్కువ ధరకు గానీ ఇస్తే, ఆ ఇచ్చే కంపెనీతో పోటీపడడం చాలా కష్టమని ఆయన అంగీకరించారు. ఇలాంటి అసంబద్ధ పోటీ వల్ల చివరకు 4–5 కంపెనీలే రంగంలో మిగులుతాయని చెప్పారాయన.