
(సాక్షి, బిజినెస్ విభాగం) : చిన్నచిన్న వర్తకులు అసంఖ్యాకంగా ఆధారపడిన దేశీ రిటైల్ రంగంలోకి భారీ సూపర్ మార్కెట్లు రావటమన్నదే అనేక వివాదాల నడుమ సాకారమయింది. వీటితో తమ బతుకుదెరువు పోతుందని భయపడి.. ఆందోళనలు చేసిన ఆయా వ్యాపారులంతా మెల్లగా పరిస్థితులకు అలవాటుపడ్డారు. ఆ తరవాత హోల్‌సేల్, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ సంస్థల్ని పూర్తిగా అనుమతించినా... మల్టీ బ్రాండ్ రిటైల్‌లో మాత్రం ఇప్పటికీ విదేశీ సంస్థలకు 49 శాతం వాటాల వరకే అనుమతి ఉంది. కాకపోతే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు వెనుకచాటుగా దీనికి తూట్లు పొడుస్తున్నవేననేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవల అమెరికన్ రిటైల్ స్టోర్ల చెయిన్ వాల్‌మార్ట్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. నిజానికి వాల్‌మార్ట్ ఇప్పటికే హోల్‌సేల్ స్టోర్ల ద్వారా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే దీనికి రిటైలర్లకు విడివిడిగా వస్తువుల్ని అమ్మే అర్హత లేదు. ఇపుడు ఫ్లిప్‌కార్ట్ దీని చేతికొచ్చింది కనక... మున్ముందు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని కొనుగోలుదార్లకు వాల్‌మార్ట్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దీనికొస్తుంది. అలా చూస్తే ఇది నేరుగా మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి వచ్చేసినట్లే లెక్క. కానీ సాంకేతికంగా చూసినపుడు వాల్‌మార్ట్ హోల్‌సేల్‌కే పరిమితమవుతుంది.
తాజాగా మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసేందుకు సమర క్యాపిటల్, అమెజాన్ కుదుర్చుకున్న డీల్ కూడా అలాంటిదే. తాజా డీల్ ప్రకారం మోర్‌లో 49 శాతం వాటాల్ని నేరుగా అమెజాన్ కొంటుంది. మిగతా 51 శాతం వాటాలు కొంటున్న సమర క్యాపిటల్‌కు చెందిన సంస్థలోనూ అమెజాన్‌కు వాటా ఉంటుంది. ఆ లెక్కన అమెజాన్ చేతికి మోర్ వచ్చేసినట్లే. అపుడు అమెజాన్‌లో కొనుగోలు చేసే వస్తువుల్ని మోర్ స్టోర్ల నుంచి డెలివరీ చేసే అవకాశం దానికి దక్కుతుంది. ఈ లెక్కన చూసినపుడు... ఆఫ్‌లైన్ స్టోర్లున్న వాల్‌మార్ట్.... ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ను కొనుగోలు చేసింది. ఆన్‌లైన్‌లో అగ్రగామిగా ఉన్న అమెజాన్... ఆఫ్‌లైన్ స్టోర్లున్న మోర్ ను కొనుగోలు చేసింది. మున్ముందు దేశీ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో రెండూ విదేశీ దిగ్గజాలే రాజ్యమేలుతాయన్నది ఈ రంగంలోని నిపుణుల మాట. ఇటీవలే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం ‘ఐకియా’ కూడా హైదరాబాద్‌లో స్టోర్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. ఐకియా నిజానికి ఫర్నిచర్, ఫర్నిషింగ్ వస్తువులమ్మే సంస్థ. కానీ ఫుడ్, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మినహా ఒక ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దీన్లో లభ్యమవుతాయి. ఐకియా వీటన్నిటినీ వివిధ కంపెనీల ద్వారా తయారు చేయిస్తుంది. కాకుంటే తయారు చేసింది ఎవరైనా... వీటన్నింటికీ ‘డిజైన్డ్ బై ఐకియా’ అనే ట్యాగ్ మాత్రం ఉంటుంది. స్థూలంగా చూస్తే దేశీ రిటైల్ మార్కెట్లోకి విదేశీ దిగ్గజాలు రకరకాల మార్గాల్లో రానే వస్తున్నాయన్నది స్పష్టం కాకమానదు.
Comments
Please login to add a commentAdd a comment