డ్రీమర్లకు సపోర్టుగా టెక్ దిగ్గజాలు
డ్రీమర్లకు సపోర్టుగా టెక్ దిగ్గజాలు
Published Mon, Sep 11 2017 5:20 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
వాషింగ్టన్: చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లి స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డ్రీమర్ల కోసం ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దు చేయడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో ఓ దావా దాఖలైంది. దీనికి పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన అన్ని కంపెనీలు ఈ దావాకు మద్దతిస్తున్నాయి. 15 సంప్రదాయ ప్రజాస్వామ్య రాష్ట్రాలు, కొలంబియా జిల్లాకు చెందిన అటార్నీస్ జనరల్ ఈ దావాను దాఖలు చేశారు. చాలామంది డ్రీమర్లు.. 16 ఏళ్ల కంటే చిన్నవయసులోనే దేశానికి వచ్చారని, తమ కంపెనీల కోసం పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డ్రీమర్లపైనే ఆధారపడి వాషింగ్టన్‌లోని చాలా కంపెనీలు పనిచేస్తున్నాయని, వారి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని ఫిర్యాదులో చెప్పారు. తమ రాష్ట్రాల్లోని అతిపెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ వంటి కంపెనీల్లో, డ్రీమర్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌గా, రిటైల్, సేల్స్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఏసీఏ రద్దుతో ఒకవేళ ఉద్యోగులు తమ స్టేటస్‌ను కోల్పోతే, చాలా బాధను భరించాల్సి ఉంటుందని అమెజాన్ ఆందోళన వ్యక్తంచేసింది. మైక్రోసాఫ్ట్‌లో 39 మంది డ్రీమర్లు ఉన్నారని, డీఏసీఏను రద్దు చేయడం దేశమొత్తానికి అతిపెద్ద ఎదురుదెబ్బ అని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు, చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ స్మిత్ చెప్పారు. డీఏసీఏ రద్దుపై వ్యాపారవేత్తలు మండిపడుతున్నారు. 8 లక్షల మంది డ్రీమర్లు, తమ కంపెనీలకు, తమ ఆర్థికవ్యవస్థకు ఎంతో ముఖ్యమని చెప్పారు. 100కు పైగా టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన దావాకు మద్దతు పలుకుతున్నాయి.
Advertisement
Advertisement