ఈ కామర్స్‌తో మరో ప్రయత్నం! | Another attempt with the e-commerce! | Sakshi
Sakshi News home page

ఈ కామర్స్‌తో మరో ప్రయత్నం!

Published Sat, Jul 18 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

ఈ కామర్స్‌తో మరో ప్రయత్నం!

ఈ కామర్స్‌తో మరో ప్రయత్నం!

నీహార్ ఇన్ఫో
 
 6 ఈ-కామర్స్ సైట్లతో మార్కెట్లోకి
♦ మరో ఆరు కంటెంట్ పోర్టళ్లు కూడా
♦ ఇప్పటికే వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లతో అందుబాటులోకి
♦ ఒక్కొక్క సైట్ విస్తరణ...
♦ డిసెంబర్ నుంచీ వరుసగా కమర్షియల్ లాంచ్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నీహార్ ఇన్ఫో. 1990ల చివర్లో డాట్‌కామ్ బూమ్‌ను ఆసరా చేసుకుని వచ్చిన అనేక న్యూస్ పోర్టళ్లలో ఒకటి. కాకపోతే డాట్‌కామ్ బుడగ బద్ధలెన తరుణంలో దాన్ని తట్టుకుని నిలిచిన అతికొద్ది పోర్టళ్లలో కూడా ఒకటి. ఐటీ సేవల కంపెనీగా మారి... తద్వారా వచ్చిన ఆదాయాలతో న్యూస్‌పోర్టల్‌ను కొనసాగిస్తూ వచ్చిన నీహార్ ఇన్ఫో... ఇపుడు ఈ-కామర్స్ బూమ్‌ను ఆసరా చేసుకుని మరో ప్రయత్నం చేస్తోంది. కంటెంట్‌కు సంబంధించి నీహార్ ఆన్‌లైన్‌తో సహా ఐదు పోర్టళ్లను తెలుగు ఇంగ్లిష్ భాషల్లో ఆరంభించిన ఈ సంస్థ... ఈ-కామర్స్ విషయంలోనూ అదే వ్యూహంతో వెళుతోంది.

ఒకే వెబ్‌సైట్‌కు పరిమితం కాకుండా బంగారం, వెండి అమ్మకాలకు ఒకటి, ఐటీ సంబంధ పరికరాలకు మరొకటి, ఇతర వస్తువులకు మరొకటి అంటూ... ఏకంగా ఆరు ఈ-కామర్స్ పోర్టళ్లను ఆరంభించింది.  పోర్టల్స్‌తో పాటు ప్రతి పోర్టల్‌కూ ఒక మొబైల్‌యాప్‌ను రూపొందించి పోర్టల్‌ను,  యాప్‌ను రెండింటినీ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. దీనిపై నీహార్ ఇన్ఫోగ్లోబల్ మేనేజింగ్ డెరైక్టర్ బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం మా కంటెంట్, ఈ కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లు అన్నీ సేవలందిస్తున్నాయి.

కాకపోతే ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఒకటి రెండింట తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ఉత్పత్తులు, పెద్ద సంఖ్యలో సెల్లర్లు లేరు. తొలిదశలో భాగంగా అన్నింటికీ కావాల్సిన ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేశాం. ప్రతి పోర్టల్‌కూ మరిన్ని ఉత్పతుర్ నాటికి ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అప్పటి నుంచి ప్రతి రెండు నెలలకూ ఒక పోర్టల్ చొప్పున కమర్షియల్ లాంచ్ చేయాలనేది మా ఆలోచన ’’ అని వివరించారు.

 మూలధన పునర్వ్యవస్థీకరణ...
 1999లో ఆరంభమైన నీహార్ ఇన్ఫో డాట్ కామ్... ఆ తర్వాత బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో(బీఎస్‌ఈ) లిస్టయింది. ఈ మధ్య కంపెనీ తన మూలధనాన్ని పునర్వ్యవస్థీకరించి రూ.1 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లుగా మార్చింది. డాట్‌కామ్ బూమ్ పతనమైన సమయంలో కూడా తన వ్యాపారాల మోడల్‌ను మార్చుకుంటూ నిలదొక్కుకుని వచ్చిన ఈ కంపెనీ... 2010 నుంచి నష్టాలను కూడా బాగా తగ్గించుకుంది. 2014-15లో మాత్రం రూ.52 లక్షల ఆదాయంపై 2 లక్షల నికరలాభాన్ని ప్రకటించింది. ‘‘న్యూస్‌పోర్టల్స్‌కు యూజర్ ట్రాఫిక్ చాలా బాగుంది. అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఈ- కామర్స్ వెబ్‌సైట్ల నుంచి ఆదాయం రావటమనేది ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. అమ్మకాలు కూడా  పెరుగుతున్నాయి. మున్ముందు పరిస్థితి ఇంకా బాగుంటుంది’’ అని సూర్యనారాయణ తెలియజేశారు. ఇటీవలే పై స్థాయిలో కొందరు టెక్నాలజీ, లాజిస్టిక్స్ నిపుణులను తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 ఇవీ పోర్టళ్లు...
 కంటెంట్‌కు సంబంధించి నీహార్ ఆన్‌లైన్.కామ్‌తో పాటు సరసం.ఇన్, హ్యూమర్‌బాక్స్.ఇన్, హాస్‌ప్రతిహాస్.కామ్ వంటివి సేవలందిస్తున్నాయి. నీహార్ ఆన్‌లైన్‌తో పాటు బాబు కార్టూన్లు, కథలు సహా వినూత్నమైన కంటెంట్ ఉన్న సరసం.ఇన్‌కు కూడా బాగా ఆదరణ ఉన్నట్లు సూర్యనారాయణ చెప్పారు. ఇక ఈ-కామర్స్ విషయానికొస్తే ఐటీదుకాన్.కామ్ ద్వారా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఫోన్ యాక్సెసరీలు విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన బంగారం, వెండి విక్రయించడానికి పలువురితో ఒప్పందాలు చేసుకుని గోల్డ్‌ఎన్‌సిల్వర్.ఇన్‌ను ప్రారంభించారు. సినిమా కంటెంట్ కోసం సినీస్కోప్.ఇన్, వివిధ సేవల కోసం ఎనీసర్వీస్.ఇన్, మ్యూజిక్ కంటెంట్ కోసం స్మార్ట్‌మెలోడీ.ఇన్, బీ2బీ ఈకామర్స్ పోర్టల్‌గా బన్యన్‌స్టోర్.కామ్ వంటివి ప్రారంభిస్తున్నా వీటిలో ఇంకా పూర్తిస్థాయిలో ఉత్పత్తులు రావాల్సి ఉంది.
 
 ఈ-కామర్స్‌లో పెద్ద సవాళ్లు...
 నిజానికి ఈ-కామర్స్ రంగం పరిస్థితి సాఫీగా ఏమీ లేదు. ఎందుకంటే ప్రైవేటు ఈక్విటీ ఫండ్ల నుంచి భారీగా నిధులు అందుకున్న అగ్రశ్రేణి కంపెనీలు వాటిని లాభాల కోసం కాకుండా విలువ పెంచుకోవటానికి ఉపయోగిస్తున్నాయి. భారీగా ప్రకటనలివ్వటానికి, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం ఈ డబ్బును వెచ్చించినా... తమ యూజర్ల సంఖ్య పెరుగుతుంది కనక దాంతోపాటే విలువ పెరుగుతుందని అది మున్ముందు లాభిస్తుందని అవి భావిస్తున్నాయి. ఇలాంటి రంగంలో సొంత నిధులతో చిన్న కంపెనీలు నెట్టుకు రావటం సులభమేమీ కాదు.

దీనిపై సూర్యనారాయణ మాట్లాడుతూ ‘‘మేం కొందరితో మాట్లాడాం. వారు పెట్టుబడులకు సుముఖంగానే ఉన్నారు. అయితే మాది లిస్టెడ్ కంపెనీ కనక సైట్లను ఓ కొలిక్కి తీసుకువచ్చాకే ఫండింగ్‌కు వెళదామని భావిస్తున్నాం’’ అని చెప్పారు. నిజానికి నీహార్ ఇన్ఫో ఈ-కామర్స్‌లో రకరకాల పోర్టళ్లను అభివృద్ధి చేస్తోంది. వాటన్నిటి నీ అమ్మకాలు పెంచి లాభాల్లోకి తేవాలంటే కష్టతరమైన పనే. సినిమా కంటెంట్‌కు సంబంధించి కూడా తమ వద్ద వినూత్నమైన ఆలోచనలున్నాయని, త్వరలో సినీ స్కోప్ ద్వారా వాటిని అమల్లోకి తెస్తామని సూర్యనారాయణ తెలియజేశారు. ఏడాదిలోగా ఎన్‌ఎస్‌ఈలో కూడా తమ కంపెనీని లిస్ట్ చేసే అవకాశం ఉందన్నారాయన. డాట్‌కామ్ బూమ్ పతనాన్ని తట్టుకుని నిలబడ్డ అతికొద్ది కంపెనీల్లో ఒకటైన నీహార్... ప్రస్తుత ఈ-కామర్స్ బూమ్‌లో చేస్తున్న ప్రయత్నం ఎలా రాణిస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement