అపోలో టైర్స్ చేతికి జర్మనీ సంస్థ
రూ.301 కోట్లతో టైర్ల పంపిణీ కంపెనీ రిఫిన్‌కమ్ కొనుగోలు
న్యూఢిల్లీ: భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు). రిఫిన్‌కమ్ ఆరు దేశాల్లో (జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్) ఆన్‌లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనితోపాటు జర్మనీలో 37 స్టోర్లు, సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది.
యూరోప్‌లో వృద్ధి లక్ష్యం...: యూరోప్‌లో వ్యాపారం మరింత వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని అన్నారు.
అన్ని కాలాల్లో అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ (సరఫరా నెట్‌వర్క్) రిఫిన్‌కమ్ విజయానికి ప్రధాన కారణం. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, సేవలను కస్టమర్లకు అందించడానికి అపోలో టైర్స్‌కు పూర్తిగా సహకరిస్తామని రిఫిన్‌కమ్ మేనేజింగ్ డెరైక్టర్లు ఓలాఫ్ స్కాయిల్, హికో నిగ్స్ తెలిపారు. తాజా పరిణామం నేపథ్యంలో సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అపోలో టైర్స్ షేర్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 1.68 శాతం ఎగసి (రూ.2.60) రూ.157.70కి చేరింది.