యాపిల్‌ లాభం 2,200 కోట్ల డాలర్లు | Apple reports better-than-expected revenue | Sakshi
Sakshi News home page

యాపిల్‌ లాభం 2,200 కోట్ల డాలర్లు

Published Thu, Jan 30 2020 4:52 AM | Last Updated on Thu, Jan 30 2020 4:52 AM

Apple reports better-than-expected revenue - Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ గత ఏడాది అక్టోబర్‌– డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ స్థాయి ఆదాయాన్ని, నికర లాభాన్ని ఆర్జించింది. గత  ఏడాది అక్టోబర్‌– డిసెంబర్‌ క్వార్టర్‌కు గాను 2,200 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.1,56,200 కోట్లు) నికర లాభం సాధించామని యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలియజేశారు. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో 9,180 కోట్ల డాలర్లకు (రూ.6,51,780 కోట్లకు) పెరిగిందని పేర్కొన్నారు, నికర లాభం, ఆదాయాల పరంగా తమ  కంపెనీకి ఇవే అత్యధిక మొత్తాలని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల శాతం 61గా ఉన్నట్లు చెప్పారు.  

5,600 కోట్ల డాలర్లకు ఐఫోన్‌ ఆదాయం  
డిసెంబర్‌ క్వార్టర్లో ఐఫోన్ల ఆదాయం 8 శాతం వృద్ధితో 5,600 కోట్ల డాలర్లకు పెరిగింది. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రొ, ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ మోడళ్లకు మంచి డిమాండ్‌ ఉండటమే దీనికి కారణం. ఐప్యాడ్‌ల ఆదాయం 600 కోట్ల డాలర్లు, మ్యాక్‌ల ఆదాయం 720 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.  

భారత్‌లో...: యాపిల్‌ కంపెనీ అమ్మకాలు భారత్‌లో జోరుగా ఉన్నాయి. ఐఫోన్‌ అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించగా, ఐపాడ్‌ల అమ్మకాలు పటిష్టంగానే ఉన్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో వేగంగా వృద్ధి సాధించిన బ్రాండ్లలో ఒకటిగా యాపిల్‌ నిలిచిందని రీసెర్చ్‌ సంస్థ, కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది. భారత్‌లో అమ్మకాలు గణనీయంగా పెరగగలవని యాపిల్‌ భావిస్తోంది. అందుకే ఇక్కడ ఐఫోన్ల తయారీ జోరును పెంచింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ తయారీని గతేడాది ప్రారంభించింది. చెన్నైలోని మూతపడిన నోకియా ప్లాంట్‌ను టేకోవర్‌ చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ఈ మార్చి నుంచి ఆరంభమవుతాయని అంచనా. ఇక్కడ చార్జర్లు, ఇతర పరికరాలను యాపిల్‌ కంపెనీ తయారు చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement