
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్ చోటు చేసుకోవడం దేశీయ పరిశ్రమకు ఉపశమనం వంటిదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పాక్షిక వాటాల విక్రయంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి పూర్తిగా తప్పుకోవడం, ప్రమోటర్ల వాటాల ఉపసంహరణలు, తాజాగా ఈక్విటీల జారీ(క్యూఐపీ)తో నిధుల సమీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘గతేడాది ద్వితీయార్ధం నుంచి మార్కెట్ సెంటిమెంట్ నిద్రాణంగా ఉండగా, గత మూడు వారాల్లో ఇది మారిపోయింది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ హెడ్ అనుజ్ కపూర్ తెలిపారు.
మార్కెట్లో ఆదరణ
డచ్ ఆర్థిక సేవల కంపెనీ ఐఎన్‌జీ గ్రూపు కోటక్ మహీంద్రాలో తనకున్న మొత్తం 3.06 శాతం వాటాను రూ.7,160 కోట్లకు విక్రయించింది. అలాగే ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబాస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 9 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,751 కోట్లను సమీకరించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ లైఫ్ 5 శాతం వాటాలను రూ.3,634 కోట్లకు విక్రయించింది. రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్ రూ.3,178 కోట్లు, లక్ష్మి విలాస్ బ్యాంకు రూ.421 కోట్ల మేర తాజాగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఈ లావాదేవీలకు మార్కెట్లో మంచి ఆదరణే లభించడం గమనార్హం. అంతెందుకు, తాజాగా ముగిసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఫర్‌సేల్‌కు సైతం భారీ మద్దతు లభించింది. ఈ స్థాయిలో నిధుల రాకను మార్కెట్ సర్దుబాటు చేసుకోగలదంటున్నారు నిపుణులు. గత నెలలో ఎఫ్‌ఐఐలు దేశీయ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు రూ.42,000 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఇన్వెస్టర్లలో ఆసక్తి తిరిగి పుంజుకోవడంతో బ్లాక్ డీల్స్, క్యూఐపీలు చోటు చేసుకుంటున్నాయి. నిధుల సరఫరా పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే మరిన్ని లావాదేవీలు జరగొచ్చు’’ అని ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జీబీ జాకబ్ తెలిపారు. ఈ తరరహా అధిక లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ ట్రేడ్స్, క్యూఐపీలకు అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు అంటున్నారు.
మరిన్ని నిధులు: అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇటీవలి ర్యాలీ, ఎన్నికల ఫలితాల పట్ల దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో మరిన్ని క్యూఐపీలు, బ్లాక్ డీల్స్, ఆఫర్‌ఫర్‌సేల్ చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణంతో ఐపీవో మార్కెట్‌లో ఇష్యూలు తిరిగి ఆరంభం అవుతాయని అనుజ్ కపూర్ తెలిపారు. ఇటీవలే ఎంబసీ నుంచి వచ్చిన తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్)కు మంచి డిమాండ్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీవో మార్కెట్‌కు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఐపీవోలను చేపట్టిన విషయం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఐపీవోలు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి డీల్స్ ఎక్కువగా జరుగుతున్నందున ఐపీవోలు వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందంటున్నారు. మొత్తం మీద ఐపీవో మార్కెట్ టర్న్‌అరౌండ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది.