10.4 శాతం వడ్డీకే 20 ఏళ్ల గృహ రుణం
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్తగా 10.40 శాతం స్థిర వడ్డీ రేటుతో 20 ఏళ్ల గృహ రుణ పథకాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. రూ. 50 లక్షల దాకా రుణాలకు ఇది వర్తిస్తుంది. అందుబాటు ధర గృహాల కొనుగోలుకు ఉపకరించేలా ఈ పరిమిత కాలం ఆఫర్‌ను అందిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ (రిటైల్ రుణాల విభాగం) జైరామ్ శ్రీధరన్ చెప్పారు.
బేస్ రేటు కన్నా ఈ వడ్డీ రేటు పావు శాతం అధికంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం బేస్ రేటు 10.15 శాతంగా ఉంది. బ్యాంకు ఖాతాదారులు కావాలనుకుంటే స్థిర వడ్డీ రేటు పథకం నుంచి చలన వడ్డీ రేటు పథకానికి మారొచ్చని శ్రీధరన్ పేర్కొన్నారు. ఇందుకోసం కొంత మొత్తం రుసుములైనా కట్టాలని, లేదా బాకీ ఉన్న అసలు మొత్తంపై 2% ఫోర్‌క్లోజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.