
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల విద్యాభ్యాసం మొదలుకుని ప్రాణాంతకమైన 55 వ్యాధుల దాకా వివిధ అవసరాలకు అనుగుణంగా కవరేజీనిచ్చే వేరియంట్లతో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ కొత్తగా సమగ్రమైన టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లో.. జీవిత భాగస్వామికి కూడా కవరేజీ పొందవచ్చు. కట్టిన ప్రీమియంలను కూడా తిరిగి పొందవచ్చు. ఇందుకు సంబంధించి మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ప్లాన్ లభిస్తుందని బజాజ్ అలయంజ్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ఇనిస్టిట్యూషనల్) ధీరజ్ సెహ్‌గల్ గురువారమిక్కడ తెలిపారు. రూ. 1 కోటి పాలసీ తీసుకునే పాతికేళ్ల వ్యక్తికి ప్రీమియం అత్యంత తక్కువగా రోజుకు రూ. 13 నుంచి ఉంటుందని ఆయన తెలిపారు. లైఫ్ కవర్, లైఫ్ కవర్ విత్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్‌ట్రా కవర్ (సీఈఈసీ) వంటి వేరియంట్లలో ఈ పాలసీ లభిస్తుందని సెహ్‌గల్ చెప్పారు.