ముంబై : ఒకప్పుడు రైళ్లు, సినిమా హాళ్లకే పరిమితమైన నల్లులు ఇప్పుడు విమనాలోనూ దర్జా వెలగబెడుతున్నాయి. అది కూడా ఏకంగా బిజినెస్ క్లాస్‌లో. నల్లులు ఇంత రాజభోగం అనుభవిస్తున్నది ఎయిర్ ఇండియా విదేశీ విమానాల్లో. పాస్‌పోర్ట్, వీసా, టికెట్‌లతో పనిలేకుండా దేశ విదేశాలను చుట్టేస్తూ మధ్యలో బోర్ కొట్టినప్పుడు తమ ఉనికిని తెలియజేయడానికి ప్రయాణికులను కుడుతూ జల్సా చేస్తున్నాయి. సరిగ్గా గతేడాది ఇదే సమయంలో ఎయిర్ ఇండియాలో చిట్టెలుకలు కనిపించి కంగారు పుట్టిస్తే ఇప్పుడు వాటి స్థానాన్ని నల్లులు ఆక్రమించాయి.
న్యూయార్క్ - ముంబై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో నల్లులు ఒక చిన్నారిని కుట్టడంతో వీటి ఉనికి బయటపడింది. తర్వాత మరో ఇద్దరు, ముగ్గురిని కూడా కుట్టడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. నల్లులతో కలిసి మేం ప్రయాణించం అని తెల్చి చెప్పడంతో, వాటిని తొలగించి తిరుగు ప్రయాణం ప్రారంభించే సరికి ఢిల్లీకి చేరాల్సిన విమానం కాస్తా ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని ప్రవీణ్ తొన్సేకర్ అనే ఒక ప్రయాణికుడు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. విమానంలో సీట్ల మీద ఉన్న నల్లులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
@airindiain @sureshpprabhu @narendramodi_in Suresh Prabhuji - just arrived from New York on Air India 144 business class with family . All our seats infested with bed bugs . Sir , have heard of bed bugs on trains but shocked to experience on our maharaja and that too business pic.twitter.com/m2GnfOpTO3
— Pravin Tonsekar (@pat_tons) July 17, 2018
ఫోటోతో పాటు ‘ఎయిర్ ఇండియా సంస్థ, విమానయాన మంత్రి సురేష్ ప్రభు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. నేను నా కుటుంబంతో కలిసి 144 సీట్లు ఉన్న ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నాను. మాకు కేటాయించిన సీట్లను మాకంటే ముందుగానే నల్లులు ఆక్రమించుకున్నాయి. ఇన్నాళ్లు రైళ్లలోనే నల్లులు ఉంటాయని విన్నాను. కానీ తొలిసారి విమానంలో, అది కూడా బిజినెస్ క్లాస్‌లో వీటిని చూసి షాక్ అయ్యాను’ అంటూ మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. ఎకానమీ క్లాస్‌లో అతనికి ఎదురైన అనుభావాల గురించి మరొక ట్వీట్‌లో పోస్టు చేశారు. అక్కడ విరిగిపోయి ఉన్న టేబుల్స్ గురించి, సరిగా లేని టీవీల గురించి తెలిపి, దాని వల్ల తన కూతురు, భార్య ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు.
ప్రవీణ్ చేసిన ట్వీట్‌కు బదులుగా ఎయిర్ ఇండియా ప్రతినిధులు రీట్వీట్ చేశారు. ‘మీకు కలిగిన అసౌకార్యానికి చింతిస్తున్నాం. మీరు ఇచ్చిన ఫిర్యాదును మేము మా నిర్వహణ విభాగానికి తెలియజేశాం. వీలైనంత త్వరగా ఈ అసౌకర్యాన్ని సరిచేస్తాం’ అని తెలిపారు. గతేడాది ఢిల్లీ - శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణిస్తున్న విమానంలో ఎలుక కనిపించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రయాణం 9 గంటలు ఆలస్యం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment