స్మార్ట్‌ఫోన్లు ఇక తప్పనిసరి!!
• ‘బిగ్ సి’ ఫౌండర్ బాలు చౌదరి
• అందరూ ఇవే అడుగుతున్నారు
• డిజిటల్ పేమెంట్లే దీనికి కారణం
• బేసిక్ ఫోన్ల అమ్మకాలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
స్మార్ట్‌ఫోన్ అంటే గతంలో ఫ్యాన్సీ. ఇపుడైతే తప్పనిసరి వినియోగ వస్తువుల జాబితాలో చేరిపోయిందని మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ చెబుతోంది. పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం ప్రోత్సహించడమే దీనికి కారణమని సంస్థ వ్యవస్థాపకుడు ఎం.బాలు చౌదరి చెప్పారు. ఫీచర్ ఫోన్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లవైపు మళ్లుతున్నారని చెప్పారాయన. బిగ్ సి 14 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ...
అమ్మకాలెలా ఉన్నాయ్? నోట్ల రద్దు ప్రభావం ఉందా?
నవంబర్ 8 వరకూ బిగ్ సి స్టోర్లలో నగదు లావాదేవీల వాటా ఏకంగా 52 శాతం ఉండేది. పెద్ద నోట్ల రద్దుతో ఇపుడది 10 శాతానికి పరిమితమైంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం ఒక్కసారిగా పెరిగింది. కార్డు చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించాం. అన్ని బ్యాంకుల సహకారంతో దీన్ని అమలు చేస్తున్నాం. నవంబరు 9 నుంచి వారం రోజులు మాత్రం అమ్మకాల్లో ఏకంగా 60శాతం తగ్గుదల కనిపించింది. డిసెంబర్ నుంచి అమ్మకాలు మళ్లీ గాడిలో పడ్డాయి. డిజిటల్ రూపంలో నగదు స్వీకరించాలన్నా, చెల్లించాలన్నా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండితీరాలి. చిన్న చిన్న వర్తకులు కూడా డిజిటల్ పేమెంట్లకు ఓకే అంటున్నారు. నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ల రంగంలో కొత్త అవకాశాలొస్తున్నాయి.
ఇవి పెరుగుతున్నాయంటే ఫీచర్ ఫోన్ల విక్రయాలు తగ్గి ఉండాలిగా?
నిజమే! మూడేళ్ల కిందట మా అమ్మకాల్లో ఫీచర్ ఫోన్ల వాటా 55 శాతం. రెండు నెలల కిందటి వరకూ 50 శాతంగా ఉండేది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత నెల రోజుల్లోనే ఈ వాటా 40 శాతానికి తగ్గిపోయింది. కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లవైపు మొగ్గటమే దీనికి కారణం. మరోవైపు సగటు స్మార్ట్‌ఫోన్ విక్రయ ధర రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో రూ.3–12 వేల ధరల శ్రేణి సింహ భాగం కైవసం చేసుకుంది. టెలికం కంపెనీల పోటీతో డేటా చార్జీలు దిగిరావడం, రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ కూడా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగటానికి కారణమయ్యాయి. అమ్ముడు పోతున్నవన్నీ 4జీ ఫోన్లే.
మరి ఆన్‌లైన్లో కూడా ఫోన్లు చౌకగా దొరుకుతున్నాయి కదా?
అదేం లేదు. ఫండింగ్ వచ్చినంత కాలం ఈ–కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. నిధుల రాక ఆగిపోవడం, ప్రభుత్వ నియంత్రణలతో ఇప్పుడివి డిస్కౌంట్లను మానేశాయి. వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతూ ఉండటంతో... ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్‌లోనే ఉత్పత్తుల ధర తక్కువగా ఉంది. అందుకే కస్టమర్లు స్టోర్లకు వస్తున్నారు.
ఏ కారణాలతో ఇంత వృద్ధి సాధ్యమైందని భావిస్తున్నారు?
మా సిబ్బందిని, కస్టమర్లను ఇద్దరినీ గుర్తించడమే మా విజయానికి మూలం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టోర్ మేనేజర్లను ఈ మధ్య బ్యాంకాక్‌లో సన్మానించాం. స్టోర్ మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని విదేశాలకు తీసుకు వెళ్లడమనేది దేశీ రిటైల్‌లో ఇదే తొలిసారి. ఇక కస్టమర్లకు బహుమతులందించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి దసరావళి విక్రయాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేశాం.