
స్టాక్ మార్కెట్లకు బిహార్ షాక్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయేకు ఊహించని ఓటమి ఎదురవడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే నష్టాల దశగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత ఇంత భారీ పతనం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 26వేల మార్కు కంటే కూడా 600 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 180 పాయింట్లు నష్టపోయి 7,790 వద్ద ట్రేడయింది.
రూపాయి కూడా బాగా దెబ్బతింది. ఉదయం ట్రేడింగులో 1 శాతం నష్టపోయి డాలర్‌తో పోలిస్తే 66.50 వద్ద ట్రేడయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దారుణ ఓటమితో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉందని ట్రేడర్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా మోదీ కూటమి గెలుస్తుందనే అంచనాలతో మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నాయని, కానీ తాజా ఫలితాల తర్వాత ఒక్కసారిగా పడ్డాయని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బాలిగ అన్నారు. అయితే ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమేనని, త్వరలోనే మార్కెట్లు కోలుకుంటాయని భావిస్తున్నారు. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 292 పాయింట్ల నష్టంతో 25973.20 వద్ద, నిఫ్టీ 91.70 పాయింట్ల నష్టంతో 7862.60 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.