ప్రపంచ మార్కెట్లు క్రాష్
సెన్సెక్స్ 350 పాయింట్లు డౌన్
26,000 దిగువన ముగింపు
116 పాయింట్లు పతనమైన నిఫ్టీ
రెండు నెలల కనిష్టానికి మార్కెట్
సూపర్‌లీడ్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెరుగుతున్న అనుమానాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. వెరసి ఆసియా నుంచి అమెరికా వరకూ ఇండెక్స్‌లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ సైతం 350 పాయింట్లు పతనమైంది. రెండు నెలల తరువాత మళ్లీ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 7,750 స్థాయిని కోల్పోయింది!
జర్మనీ మాంద్యంలోకి జారడం, యూరప్ దేశాల రుణ సంక్షోభం మళ్లీ తెరమీదకు రావడం, నిరవధికంగా పడుతున్న చమురు ధరలు, చైనా వృద్ధి అంచనాలు తగ్గడం వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఇవి చాలవన్నట్లు ప్రాణాంతక వ్యాధి ఎబోలా అతివేగంగా విస్తరించనుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు షాకిచ్చాయి.
దీంతో బుధవారం అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా పతనంకాగా, గురువారం ఆసియా మార్కెట్లు సైతం నీరసించాయి. ఈ బాటలో దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 25,999 వద్ద ముగిసింది. నిఫ్టీ 116 సైతం పాయింట్లు దిగజారి 7,748 వద్ద నిలిచింది. ఆశించిన స్థాయిలో స్పెయిన్ బాండ్లను విక్రయించలేకపోవడం, గ్రీస్, ఐర్లాండ్, పోర్చుగల్, ఇటలీ వంటి దేశాల రుణ భారం నేపథ్యంలో బాండ్ల ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు తాజాగా సెంటిమెంట్‌ను బలహీనపరచాయని విశ్లేషకులు వివరించారు.
తొలుత ఓకే
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ తొలుత దేశీ మార్కెట్లు లాభాలతో నిలదొక్కుకున్నాయి. టోకు, రిటైల్ ధరలు తగ్గడం, చమురు ధరలు దిగిరావడం, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత కనిపించడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్లు భారీ నష్టాలకులోనుకావడంతో దేశీయంగానూ సెన్సెక్స్, నిఫ్టీ ఉన్నట్టుండి కుదుపునకు లోనయ్యాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు పెరిగాయి. రెండు నెలల కనిష్టంవద్ద మార్కెట్లు ముగిశాయి.
ఇతర విశేషాలివీ...
* గత మూడు రోజుల్లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 1,128 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దేశీ ఫండ్స్ రూ. 664 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
* బజాజ్ ఎలక్ట్రికల్స్, వీఐపీ, టైటన్, సింఫనీ, బ్లూస్టార్, వర్ల్‌పూల్ 6-3% మధ్య పతనంకావడంతో వినియోగ వస్తు సూచీ అత్యధికంగా 4.3% జారింది.
* చైనా నుంచి డిమాండ్ క్షీణిస్తుందన్న అంచనాలు మెటల్ షేర్లను పడగొట్టాయ్. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ 5.5-3.5% మధ్య పడ్డాయి.
* పవర్ షేర్లలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, టొరంట్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, సీఈఎస్‌సీ 8-3% మధ్య తిరోగమించాయి.
* ఆటో షేర్లలో అపోలో టైర్స్, ఎంఅండ్‌ఎం, భారత్ ఫోర్జ్, మదర్సన్‌సుమీ, ఎంఆర్‌ఎఫ్, హీరోమోటో 5-2% మధ్య క్షీణించాయి.