తొలుత -170, ఆపై +170
- చివరికి 116 పాయింట్లు ప్లస్
- 27,207 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 2 వారాల గరిష్టానికి మార్కెట్లు
మార్కెట్ అప్‌డేట్
ప్రపంచ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రధాన సూచీలు 340 పాయింట్లస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నష్టాల కారణంగా సెన్సెక్స్ తొలుత నష్టాలతో మొదలైంది. 26,919 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఆపై మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ బలపడటంతో నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. గరిష్టంగా 27,255కు చేరింది. చివరికి 116 పాయింట్ల లాభంతో 27,207 వద్ద స్థిరపడింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా తొలుత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ 25 పాయింట్లు బలపడి 8,146 వద్ద ముగిసింది. ప్రధానంగా టాటా మోటార్స్(4%), ఓఎన్‌జీసీ(3.5%), ఐటీసీ(3%), హీరో మోటో(1.5%), ఎస్‌బీఐ(1.5%) వంటి దిగ్గజాలు ప్రధాన సూచీలకు అండగా నిలిచాయి.
వినియోగ వస్తు సూచీ 3% అప్
బీఎస్‌ఈలో వినియోగ వస్తువుల సూచీ అత్యధికంగా 3% పుంజుకోగా, ఎఫ్‌ఎంసీజీ 2%, ఆటో 1% చొప్పున లాభపడ్డాయి. మెటల్స్ 1%పైగా నష్టపోయింది. వినియోగ షేర్లలో పీసీ జ్యువెలర్స్ 20% జంప్‌చేయగా, సింఫనీ, వీఐపీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, వర్ల్‌పూల్, టైటన్, బ్లూస్టార్ 9-2% మధ్య పెరిగాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఇన్ఫీ 2.5-1.5% మధ్య క్షీణించాయి.
న్యూలాండ్ ల్యాబొరేటరీస్: రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 16న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.25 కోట్లు సమీకరించనుంది. రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు రూ.194 ప్రీమియం నిర్ణయించారు. ప్రతి 25 షేర్లకుగాను నాలుగు షేర్లు కేటాయిస్తారు.