జోరుగా హుషారుగా
* చిన్న షేర్ల మారథాన్
* స్మాల్ క్యాప్ 3% హైజంప్
* అదే బాటలో మిడ్ క్యాప్స్
* మార్కెట్లకు స్వల్ప లాభాలు
* రియల్టీ జోష్, ఆయిల్ డీలా
మోడీ వేవ్‌తో ఊపందుకున్న చిన్న షేర్లు దుమ్మురేపుతున్నాయి. ప్రధానంగా ఇన్‌ఫ్రా, పవర్, మైనింగ్ వంటి రంగాలకు జోష్‌నిచ్చే బాటలో మోడీ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపడుతుందన్న అంచనాలు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు డిమాండ్ పెంచుతున్నాయి. వెరసి బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ మార్కెట్లను మించుతూ 3% జంప్‌చేయగా, మిడ్ క్యాప్ సైతం దాదాపు 2% ఎగసింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో విధానపరమైన నిర్ణయాలు కుంటుపడటంతో తయారీ, బ్యాంకింగ్‌సహా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే.
ధరలను అదుపు చేయడం, పారిశ్రామికోత్పత్తిని పట్టాలెక్కించడం, ద్రవ్యలోటుకు క ళ్లెం వేయడం వంటి పలు సవాళ్లను కొత్త ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఇటు ఇన్వెస్టర్లు, అటు పారిశ్రామిక వ ర్గాలు అంచనా వేస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. దీంతో పవర్, ఇన్‌ఫ్రా వంటి రంగాల షేర్లకు భారీ డిమాండ్ పుడుతున్నదని చెప్పారు. కాగా, వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. అయితే రోజంతా స్వల్ప స్థాయిలో ఒడిదుడుకుల కు లోనయ్యాయి. చివరకు సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 24,377 వద్ద నిలవగా, 12 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 7,275 వద్ద ముగిసింది. ఇవి కూడా కొత్త గరిష్టస్థాయి ముగింపులే కావడం విశేషం!
20% అప్పర్ సీలింగ్
మిడ్ క్యాప్స్‌లో బీజీఆర్, క్యాపిటల్ ఫస్ట్, డీబీ రియల్టీ, ఇండియాబుల్స్ పవర్, గీతాంజలి, ల్యాంకో ఇన్‌ఫ్రా 20% అప్పర్ సీలింగ్‌ను తాకాయి. ఈ బాటలో అబాన్ ఆఫ్‌షోర్, ఎంటీఎన్‌ఎల్, యూనిటెక్, నవనీత్, బిల్ట్, కోల్టేపాటిల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ట్రాన్స్, జామెట్రిక్, ఏఐఏ, కార్బొరేండమ్, బార్మెర్ లారీ, మోతీలాల్ ఓస్వాల్, ఎంఎంటీసీ, సుజ్లాన్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఐవీఆర్‌సీఎల్ 18-10% మధ్యఎగశాయి.
ఆయిల్ షేర్లలో అమ్మకాలు
ఆయిల్ ఇండెక్స్ 3.3% నష్టపోగా, రియల్టీ 5% జంప్ చేసింది. ఈ బాటలో ఐటీ, మెటల్, హెల్త్‌కేర్ రంగాలు 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో కోల్ ఇండియా 6% పతనంకాగా, సెసాస్టెరిలైట్ 8% ఎగసింది. ఇక ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ 4% నష్టపోగా, భెల్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, భారతీ, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో 4-3% మధ్య బలపడ్డాయి.