
వాహన ధరలకు రెక్కలు..
4 శాతం వరకూ పెరిగే అవకాశం..
టీవీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఉత్పత్తుల రేట్లు కూడా పైపైకి...!
ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపు లేదని తేల్చిచెప్పిన కేంద్రం...
న్యూఢిల్లీ: కొత్త ఏడాది వస్తూనే వినియోగదారుల జేబులు కొల్లగొడుతోంది!! వాహనాలు, టీవీ, ఫ్రిజ్ వంటి వినియోగ వస్తువుల ధరలు రేపటి(జనవరి 1) నుంచి పెరగనున్నాయి. కార్లు, టూ వీలర్లు, కన్సూమర్ డ్యూరబుల్స్‌పై ఇప్పటివరకూ ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో వాహనాల ధరలు 4 శాతం వరకూ పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ పలు వాహన కంపెనీలు తమ కార్ల ధరలను ఇప్పటికే 2 శాతం వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరుగుదల కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నది. ఏతావాతా కొత్త ఏడాది వస్తూనే వినియోగదారులపై ధరల దెబ్బ తీయనున్నది.
ఖజానాకు రూ. 1,000 కోట్ల అదనపు రాబడి...
గత రెండు సంవత్సరాలుగా తగినంతగా అమ్మకాల్లేక అతలాకుతలమైన వాహన రంగాన్ని ఆదుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ రాయితీలు జూన్30 వరకూ అమల్లో ఉన్నాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఎక్సైజ్ రాయితీలను ఈ నెల 31 వరకూ పొడిగించింది.
ఎక్సైజ్ సుంకం రాయితీలను మరికొంత కాలం కొనసాగించాలని వాహన కంపెనీలు కోరుతూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని, ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగిస్తే వాహన రంగానికి ప్రయోజనం కలుగుతుందనేది ఆటోమొబైల్ కంపెనీల వాదన. ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపుపై ఈ నెల 31 వరకూ వేచి చూడండి అని కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఊరించారు.
కానీ అందరి అంచనాలకు భిన్నంగా ప్రభుత్వం ఈ రాయితీలను పొడిగించలేదు. ఎక్సైజ్ సుంకం రాయితీలను కొనసాగించడం లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల అదనపు రాబడి సమకూరుతుందని. దీంతో ద్రవ్యలోటును జీడీపీలో 4.1%కి పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని అంచనాలున్నాయి.
తిరోగమన చర్య: ఇది తిరోగమన చర్య అని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. అధిక వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న వినియోగదారుల సెంటిమెంట్ అంశాలకు ఎక్సైజ్ సుంకం పెంపు కూడా తోడైతే రానున్న ఏడాది కూడా వాహన పరిశ్రమకు గడ్డుకాలమేనని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం పెంపును వినియోగదారులకు బదలాయించక తప్పదని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్. సి. భార్గవ చెప్పారు.
ధరలు పెరుగుతాయని, దీంతో అమ్మకాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ధరలు పెరుగుతాయని, డిమాండ్‌పై ప్రభావం ఉంటుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్)జ్ఞానేశ్వర్ సేన్ వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లో మంచి అమ్మకాలు సాధిస్తామని ఆశగా ఉన్నామని, కానీ ఈ నిర్ణయం ఆ ఆశలపై నీళ్లు చల్లిందని హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. ఇప్పటికే అధికంగా ఉన్న వడ్డీరేట్లు, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా అమ్మకాలు తగ్గాయని, ఎక్సైజ్ సుంకం రాయితీ కారణంగా ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఎంత పెరుగుతాయ్...
రూ. 1.97 లక్షల నుంచి రూ.4.03 లక్షల రేంజ్‌లో ఉన్న టాటా నానో, మారుతీ ఆల్టో800, హ్యుందాయ్ ఈఆన్ వంటి ఎంట్రీ లెవల్ కార్ల ధరలు రూ.7,900 నుంచి రూ.16,000 వరకూ పెరగవచ్చు. అలాగే రూ.4.42 లక్షల నుంచి రూ.7.66 లక్షల రేంజ్‌లో ఉండే మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఇలీట్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బాక్ కార్ల ధరలు రూ.17,700 నుంచి రూ.30,600 వరకూ పెరగవచ్చు.