
న్యూఢిల్లీ: దేశీయ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ బహుళ ప్రొడక్టుల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేయడంపై ట్రేడర్స్ సంఘం– సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) తీవ్రంగా నిరసించింది. దీనికి వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో తమ వాదనలు వినిపించడానికి సీసీఐ తగిన అవకాశం ఇవ్వలేదని ట్రిబ్యునల్‌కు సీఏఐటీ తెలిపింది.
వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ కలయిక మార్కెట్‌లో పూర్తి గుత్తాధిపత్యం నెలకొంటుందని సీఏఐటీ పేర్కొంది. ఈ కొనుగోలు వల్ల మిగిలిన టోకు వ్యాపారుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నది తమ వాదనని సీఏఐటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలూ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడిన అంశాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్టించుకోలేదని సీఏఐటీ పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ బహుళ ప్రొడక్టుల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు ఒప్పందానికి ఈ నెల 8వ తేదీన సీసీఐ ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ దాదా పు 16 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఈ ఏడాది మేలో తొలుత ప్రకటించింది.