రెండు ఎంఆర్‌పీ రేట్లతో ప్రయోజనం
♦ ఉత్పత్తుల రేట్లు పెరిగాయా,
♦ తగ్గాయా అన్నది తెలుస్తుంది
♦ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అభిప్రాయం
న్యూఢిల్లీ: జూన్ చివరి నాటికి అమ్ముడుపోని సరుకులపై జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత రేట్లను పేర్కొని విక్రయించుకునే అవకాశం వల్ల నిల్వలు ఖాళీ చేసుకునేందుకు వీలవుతుందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. మార్కెట్లో పారదర్శకత కూడా వస్తుందని పేర్కొన్నాయి. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు పెరిగాయా లేక తగ్గాయా అన్నది వినియోగదారులు తెలుసుకునేందుకు తోడ్ప డుతుందని అన్నాయి.
అమ్ముడు పోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై సవరించిన ధరల ట్యాగ్‌ను వేసుకుని మూడు నెలల పాటు విక్రయించుకునేందుకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మాత్రం ఒకటే ఎంఆర్‌పీ(గరిష్ట చిల్లర ధర) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. దీంతో ఈ నిర్ణయాన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు స్వాగతించాయి.
ధరలపై స్పష్టత: ఈ వెసులుబాటు జీఎస్టీ సాఫీగా అమలయ్యేందుకు వీలు కల్పిస్తుందని పతంజలి కంపెనీ పేర్కొంది. ఎంఆర్‌పీ విషయంలో వర్తకులు, తయారీదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తుందని తెలిపింది. వినియోగదారులు సైతం జీఎస్టీ వల్ల ధరలు పెరిగాయా, తగ్గాయా అన్నది తెలుసుకోగలుగుతారని పేర్కొంది. సవరించిన ధరలతో తమ ఉత్పత్తులను ఇప్పటికే విడుదల చేయడం ప్రారంభమైందని హెచ్‌యూఎల్ తెలిపింది.