
క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9%
బీజింగ్: చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం తాజాగా కొత్త ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
మెరుగుపడుతున్న సేవలు, వినియోగం ...
దేశ గణాంకాల బ్యూరో విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడచిన మూడు త్రైమాసికాల్లో దేశ జీడీపీ విలువ 48.79 ట్రిలియన్ యువాన్‌లు (7.68 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు). మొత్తం జీడీపీ విలువలో సగం సేవారంగం నుంచి వచ్చిందని గణాంకాలు తెలిపాయి. ‘అమెరికా వడ్డీరేట్ల పెంపు అంచనాలు కమోడిటీ, స్టాక్, ఫారెన్ కరెన్సీ మార్కెట్లపై ప్రభావితం చూపుతున్నాయి. పలు దేశాలు తమ కరెన్సీల విలువను తగ్గిస్తున్నాయి.
ఈ ప్రభావం చైనా ఎగుమతులపై పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలతల్లో ఇది ఒకటి’ అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రతినిధి షాంగ్ లియూన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గత ఏడాది 7.3 శాతం నుంచి ఈ ఏడాది 6.8 శాతానికి పడిపోతుంది. వచ్చే ఏడాది ఈ రేటు 6.3 శాతంగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో 7 శాతం పైగా వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందిన దేశం హోదా దక్కించుకుంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.