నాలాపై స్పష్టత ఏదీ? | cm announced in 2014 no nallah charges but no results | Sakshi
Sakshi News home page

నాలాపై స్పష్టత ఏదీ?

Published Sat, Feb 18 2017 12:51 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

నాలాపై స్పష్టత ఏదీ? - Sakshi

నాలాపై స్పష్టత ఏదీ?

ఈ వాదన అతనొక్కడిదే కాదు.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరిదీనూ!

నాలా చార్జీలను ఎత్తేస్తున్నాం: 2014లో సీఎం వెల్లడి
కానీ, వాస్తవ రూపం దాల్చని హామీ; చార్జీ తగ్గింపు తోనే సరి
2006 కంటే ముందున్న వాటికి నో నాలా: హై కోర్టు తీర్పు
భేఖాతరంటోన్న హెచ్‌ఎండీఏ; పన్ను కడితేనే ప్లాన్‌ అంటూ ఒత్తిడి


ఎవరి వాదన వారిదే..
బోడుప్పల్‌లో ఓ ఇంటి యజమాని తన 200 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ కోసం ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది 20 ఏళ్ల క్రితమే నివాస లే–అవుట్‌గా రిజిస్ట్రేషన్‌ అయింది. అయితే ఇప్పుడు హెచ్‌ఎండీఏ ఏమంటోందంటే.. ఈ లే–అవుట్‌ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి.. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం 3 శాతం నాలా పన్ను కట్టాల్సిందేనని

మరి, యజమాని ఏమంటున్నారంటే.. 2006లో నాలా చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే అంతకుముందున్న లే–అవుట్లకు ఈ చట్టం వర్తించదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకుంటే అప్పటి మార్కెట్‌ రేటు ప్రకారం కాకుండా ప్రస్తుతమున్న ధర ప్రకారం నాలా పన్నును చెల్లించమనడం సరైంది కాదు. గతంలో కె. సత్యానంద పట్నాయక్‌ పిటిషన్‌లోనూ హెకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని

సాక్షి, హైదరాబాద్‌:
ఈ వాదన అతనొక్కడిదే కాదు.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరిదీనూ! వాస్తవానికి 2014లో జరిగిన ఓ ప్రాపర్టీ షోలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ‘నాలా పన్నును ఎత్తేస్తున్నామని’ ప్రకటించారు. కానీ, అది నేటికీ వాస్తవరూపం దాల్చలేదు. 9 శాతంగా ఉన్న నాలా పన్నును కాస్త 3 శాతానికి తగ్గిస్తూ జీవో విడుదల చేశారు. దక్కిందే పుణ్యమని ఇక్కడికే సరిపెట్టుకున్నారు భాగ్యనగర డెవలపర్లు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కేంటంటే.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే నాలా పన్నును చెల్లించాల్సిందేనని హెచ్‌ఎండీఏ వాదిస్తోందని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) అంటోంది.

పైగా వాయిదాల రూపంలో కాకుండా ఒకేసారి చెల్లించాలని అప్పుడే ప్లాన్‌ విడుదల చేస్తామంటూ డెవలపర్లను వేధిస్తున్నారని టీబీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ జే వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక నిర్మాణ సంస్థలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. గతంలోనూ నిర్మాణ సంస్థల వాదనలు విన్న న్యాయస్థానం నిరభ్యంతర ధృవీకరణ పత్రం విషయంలో నాలా చార్జీలను చెల్లింపుల గురించి ఒత్తిడి తేకూడదని వెల్లడించింది. అయినప్పటికీ హెచ్‌ఎండీఏ మొండి వైఖరి అవలంబిస్తోందంటూ నిర్మాణ రంగం వాపోతోంది.

2006 కంటే ముందుంటే..
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌ (నాలా)ను తీసుకొచ్చింది. మార్కెట్‌ విలువలో 10 శాతం పన్నును చెల్లించాలని నిర్ణయించింది. అయితే నిర్మాణ సంస్థల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ పన్నును హెచ్‌ఎండీఏ పరిధిలో 9 శాతానికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఆ పన్నును కాస్త హెచ్‌ఎండీఏ పరిధిలో 3 శాతానికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 2 శాతానికి తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే 2006 కంటే ముందున్న లే–అవుట్లకు మాత్రం ఈ చట్టం వర్తించదు.

8330/పీ8/పాలసీ/హెచ్‌/2009 ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో డెవలప్‌మెంట్‌ చార్జీలను వాయిదా పద్ధతుల్లో చెల్లించే వీలుంది కూడా. హెచ్‌ఎండీఏ చట్టం 2008లోని 46(5) ప్రకారం డెవలప్‌మెంట్, క్యాపిటలైజేషన్‌ చార్జీలను 10 శాతం వడ్డీతో వాయిదా పద్ధతిలో చెల్లించే వీలు కల్పించారు అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ప్రదీప్‌ చంద్ర. అంటే రూ.15– 75 లక్షల వరకు 4 సమాన వాయిదాల్లో, రూ.75 లక్షల కంటే అధిక మొత్తమైతే 8 వాయిదాల్లో 24 నెలల్లో చెల్లించవచ్చన్నమాట.

డెవలపర్లను ప్రోత్సహించడం మానేసి..
నాలా పన్నును సాకుగా చూపుతూ ప్రాజెక్ట్‌ల అనుమతుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని, అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు నగరం, పట్టణాల్లోని వ్యవసాయ భూమిని నాన్‌–అగ్రికల్చరల్‌ ల్యాండ్‌కు మార్పు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పంచాయతీ పరిధిలోనూ దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు బడా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. ఫీజుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం దండిగా వస్తోంది. కానీ, మన రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉన్న భూమికి సైతం నాలా పన్నును కట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకురావటం అనైతికం. అది కూడా ప్రస్తుతమున్న మార్కెట్‌ విలువ ప్రకారం చెల్లించాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారని డెవలపర్లు వాపోతున్నారు. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే సామర్థ్యమున్న నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం మానేసి.. నీరుగార్చేలా చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పనితీరుపై సీఎంకు వినతిప్రతం ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు. – జే వెంకట్‌ రెడ్డి టీబీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement