హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్‌డౌన్‌లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్‌లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్‌డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది.
సిద్ధమైన కంపెనీలు..
ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్‌సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు.
అక్షయ వాటా 30–40 శాతం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్‌లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
ఇక బంగారం కొనేద్దాం..
కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ
న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్‌టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్‌లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు..
సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్‌లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
అక్షయ తృతీయ @ ఆన్‌లైన్!
Published Fri, Apr 24 2020 4:45 AM | Last Updated on Fri, Apr 24 2020 4:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment