డీమానిటైజేషన్ చిన్న కుదుపు మాత్రమే
• భారత్ నిలకడగా 7 శాతం పైగా వృద్ధి సాధించగలదు
• సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్
జైపూర్: వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద నోట్ల రద్దు ఒక చిన్న కుదుపులాంటిది మాత్రమేనని సిస్కో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో నిలకడగా 7 శాతం పైగా వృద్ధి రేటు సాధించేసత్తా భారత్‌కి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల్లో అగ్రస్థానంలో ఉండగలదని చాంబర్స్ చెప్పారు. యూఎస్‌ఐబీసీ చైర్మన్ కూడా అయిన చాంబర్స్.. 8వ వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలోపాల్గొనేందుకు అమెరికా వ్యాపార దిగ్గజాల బృందంతో భారత్ వచ్చారు.
ఈ నేపథ్యంలో డీమోనిటైజేషన్ వంటి ఆకస్మిక పరిణామం భారత్‌లో వ్యాపారాల నిర్వహణపై విదేశీ సంస్థల అభిప్రాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందా అన్న ప్రశ్నపైస్పందిస్తూ.. ఆర్థిక ప్రపంచంలో నోట్ల రద్దు అంశాన్ని తప్పు బట్టే వారు చాలా తక్కువే ఉంటారని చాంబర్స్ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యేందుకు ఇది పునాది వేయగలదని ఆయన చెప్పారు. సాధారణంగా కొత్తఆవిష్కరణలు తెరపైకి వచ్చినప్పుడు కచ్చితంగా కుదుపులు ఉంటాయన్నారు. అయితే, భారత్ సరైన వ్యూహం, దార్శనికతతో సరైన దిశలో వేగంగా పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అసూయ చెందేలా వృద్ధి..: దేశీ ఎకానమీపై డిజిటల్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వల్ల అత్యంత వేగంగా 3–5 రెట్లు అధికంగా సానుకూల ఆర్థిక ప్రభావాలు ఉండగలవని చాంబర్స్ చెప్పారు. ‘ఈ మార్పుల ఊతంతో ఇప్పట్నుంచి ఏడాదివ్యవధిలో ప్రపంచం అసూయ చెందేలా భారత జీడీపీ మరింత పటిష్టంగా మారుతుంది. జీడీపీ వృద్ధి ఏడు శాతం స్థాయిలో నిలకడగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. 8..9..10 శాతం కూడా సాధించే అవకాశాలు లేకపోలేదు’ అని చాంబర్స్‌పేర్కొన్నారు. గతంలో మందకొడిగా మిగతా దేశాలను అనుసరిస్తుందంటూ పేరొందిన భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న దేశంగా పేరు తెచ్చుకుంటోందని చెప్పారు.